హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ఇచ్చింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గోదావరికి పోటెత్తిన వరద
భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి వచ్చే వరదలతో బుధవారం రాత్రికి 35 అడుగులకు నీటి మట్టం చేరుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. గోదావరి వరదలపై బుధవారం ఆఫీసర్లతో కలెక్టర్ రివ్యూ చేశారు. రాబోయే 24 గంటల పాటు గోదావరికి వరద పోటు ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో కలెక్టర్ పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. గ్రామాల్లోకి నీరొస్తే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. సాయంత్రం 5 గంటలకే 32 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి పొంగడంలో భద్రాచలం, పర్ణశాల స్నానఘట్టాల వద్ద షాపులు మూతపడ్డాయి. కాళేశ్వరం నుంచి 2.35 లక్షలు, ఇంద్రావతి నది నుంచి 2.15లక్షలు, తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరికి వస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత నది ఉప్పొంగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కౌటల మండలం తుమ్మిడిహెట్టి , చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నది.
