- ఆన్‌లైన్ లావాదేవీలు జరిపిన ‘వరల్డ్ లైన్ ఇ–పేమెంట్’ గేట్‌వే
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ
హైదరాబాద్, వెలుగు: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించిన ‘వరల్డ్ లైన్ ఇ–పేమెంట్’ గేట్‌వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్ (46)ను తెలంగాణ సీఐడీ శుక్రవారం ముంబయిలో అరెస్ట్ చేసింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఫాల్కన్ గ్రూప్ చైర్మన్, ఎండీ అమర్‌దీప్‌కుమార్‌తో మొహిదీన్ కుమ్మక్కై వరల్డ్‌లైన్ ఇ-–పేమెంట్ గేట్‌వే ద్వారా డిపాజిట్ల సేకరణ, చెల్లింపులు జరిపాడు. సీఐడీ ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించింది. కంపెనీ లావాదేవీల ద్వారా అతనికి సుమారు రూ.7.53 కోట్లు ఆదాయం వచ్చినట్లు నిర్ధారించింది.
ఆఫర్ పేరుతో రూ.792 కోట్లు మోసం
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, హుడా ఎన్‌క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వాయిస్ డిస్కౌంట్స్ ఆఫర్ పేరుతో పెట్టుబడులు వసూలు చేశారు. పెట్టుబడిపై ప్రతి ఏటా 11 నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు. ఇలా నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ. 4,215 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కింద పనిచేస్తున్న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 4,065 మందిని రూ.792 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అమర్‌దీప్‌తోపాటు అతని సోదరుడు ఫాల్కన్ కంపెనీ ఆపరేషనల్ హెడ్ సందీప్‌కుమార్, మరో నిందితుడు రవికుమార్‌లను గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ అరెస్ట్ చేసింది.
