టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుపై మరో కేసు నమోదు

 టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుపై మరో కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. 2024 ఏప్రిల్ 4 బుధవారం నాడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పై మరో కేసు నమోదైంది. క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి తనపై ఉన్న షేర్లు బలవంతంగా రాయించుకున్నారని చైర్మన్ వేణుమాధవ్ చెన్నుపాటి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అంతే కాక తనపై ఉన్న యాజమాన్య హక్కులను కూడా మార్పిడి చేశారని బాధితుడు పోలీసులకు తెలిపారు. 

దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు రాధా కిషన్ రావుతో సహా ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ ఐ మల్లికార్జున్ పలువురు పోలీస్ అధికారులపై కేసు నమోదు చేశారు. 2018 నవంబర్ లో తనను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకువెళ్లి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని వేణుమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాధా కిషన్ రావు అరెస్ట్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసానని తెలిపారు. రాధాకిషన్ తో సహా నలుగురు అధికారులపై ఐపీసీ సెక్షన్ 386,365,341, 120(బీ) రెడ్ విత్ 34 సెక్టైన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

మరోవైపు రాధా కిషన్ రావుకు ఏప్రిల్ 12వరకు రిమాండ్ పొడిగించింది నాంపల్లి కోర్టు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఇవాళ్టితో రాధా కిషన్ రావు కస్టడీ ముగియడంతో  కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.  ఈ సందర్భంగా చంచల్ గూడ జైలులో  జైలు సూపరిండెంట్ ను కలవనివ్వడం లేదని.. లైబ్రరీకి వెళ్లనివ్వడం లేదంటూ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకోచ్చారు రాధా కిషన్ రావు. సూపరిండెంట్ ను కలిసేందుకు అలాగే.. లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మేజిస్ట్రేట్ ఆదేశించింది.   అనంతరం రాధా కిషన్ రావును  చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.