సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకు గలుషమడచు
గీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి చేయు
సాధుసంగంబు సకలార్థ సాధనంబు
సజ్జనులతో సహవాసం సత్యవాక్యాలనే పలికేలా చేస్తుంది. బుద్ధి మాంద్యాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపాలను దూరం చేస్తుంది. కీర్తిని వ్యాపింపచేస్తుంది. మనోవికాసాన్ని కలిగింపచే స్తుంది. సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలనూ సాధిస్తుంది... భర్తృహరి చెబుతున్నాడు. మంచివారితో స్నేహం మంచినే కలిగిస్తుందని మనకు పెద్దలు చెప్పడం తెలిసిందే. ‘ఏ గూటి చిలుక ఆ పలుకే పలుకుతుంది’ అనే సామెత ఉండనే ఉంది.
ఒక ఊరిలో ఒక చిలకల వ్యాపారి ఉండేవాడు. ఒకసారి ఒక రాజు, కసాయివాడు... ఇద్దరూ ఒకేసారి చిలుకలు కొనుక్కుని తీసుకెళ్లారు. రాజు దగ్గర ఉన్న చిలుక నిరంతరం మంచి మాటలను వింటూ ఉండేది. ‘రండి, కూర్చోండి, మంచినీళ్లు తాగుతారా, భోజనం చేస్తారా, అందరూ కులాసానా’ ఇలాంటి మాటలు వింటూ పెరిగింది.
కసాయి దగ్గర చిలుక, ‘చంపు, కైమా కొట్టు, నరుకు’ అనే మాటలు వింటూ పెరిగింది. ఆ చిలుకలు అమ్మిన వ్యక్తి తన రెండు చిలుకలు ఎలా పెరుగుతున్నాయో చూడటానికి వెళ్లాడు. రాజు గారి దగ్గర ఉన్న చిలుక, ‘రండి, కూర్చోండి, మంచినీళ్లు తాగుతారా’ అంటూ మర్యాదగా పలకరించింది. ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అక్కడ నుంచి కసాయి దగ్గరకు వెళ్లాడు. అక్కడకు రాగానే, ‘చంపండి, నరకండి’ అంటూ పరుషంగా మాట్లాడింది.
ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు వ్యాపారి. రెండింటినీ అమ్మినవాడిని నేనే కదా. మాటలలో ఇంత తేడానా. సజ్జన సాంగత్యం వలన మంచి మాటలు వస్తాయి.. అని అర్థం చేసుకున్నాడు. భర్తృహరి చెప్పిన మాటలకు ఈ కథ చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.మన స్నేహితులను బట్టి మనలను అంచనా వేస్తారు. దుర్యోధనుడితో స్నేహం కారణంగా కర్ణుడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడో కర్ణుడే స్వయంగా చెబుతాడు భారతంలో. అందుకే సజ్జనులతో స్నేహం చేయమన్నారు.
సజ్జనులు ఎన్నడూ అసత్యం పలుకరు. సత్యమే పలుకుతారు. ఇందుకు రాముడు, ధర్మరాజు ఉదాహరణలుగా కనబడతారు. సత్యం కోసమే రాముడు అరణ్యాలకు వెళ్లాడు. ద్రోణాచార్యుడిని చంపవలసిన సమయంలో కూడా, ‘అశ్వత్థామ హతః’ అని పలకమని చెప్పినప్పటికీ ధర్మరాజు పలకలేకపోయాడు.
సరిగ్గా అదే సమయంలో అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు హతం కావడంతో, అదే మాటను అన్నాడు ధర్మరాజు. ‘అశ్వత్థామ హతః’ అని పలుకగానే శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ ధ్వనిలో ‘కుంజరః’ అనే పదం ఎవ్వరికీ వినపడలేదు. అలా ధర్మరాజుకి అసత్య దోషం కలుగలేదు.
సజ్జనుడు అన్ని విషయాలను సరైన బుద్ధితో ఆలోచిస్తాడు. అటువంటి వారితో స్నేహం చేసినవారికి బుద్ధిజాడ్యం తొలగిపోతుంది. పక్షి సంతతివారైన జటాయువు, సంపాతి.. ఇక్ష్వాకు వంశీయులతో చేసిన స్నేహం కారణంగా రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోతున్న సమయంలో జటాయువు తన శక్తికొలదీ పోరాడాడు. రామునితో స్నేహం చేసిన గుహుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు.. అందరికీ గౌరవం లభించింది. రాముని గాలి సోకగానే, ధూళితో కప్పబడిన అహల్య తన యథారూపాన్ని పొందింది. సజ్జన సాంగత్యం వల్ల పాపాలు తొలగిపోతాయి.
వేమన ‘నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు, కొదువలేదు సుజన గోష్ఠి వలన’ అని సుజన గోష్ఠి వల్ల నీచగుణాలు తొలగిపోతాయని, వారితో స్నేహం చేయడం వలన ఎటువంటి ఆపదలు కలుగవని చెబుతున్నాడు. అంతేనా సుజనులతో స్నేహం చేస్తే పాపాలు కూడా తొలగిపోతాయి. వారి కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది. మనో వికాసం కలుగుతుంది.
సజ్జన సాంగత్యం వల్ల సమస్త ప్రయోజనాలు సమకూరతాయి. ‘సత్పురుష సఖ్యము సద్గతికారణంబు’.. సత్పురుషులతో స్నేహం చేయడం వలన సద్గతులు కలుగుతాయని పోతన శ్రీమద్భాగవతంలో అంటున్నాడు. ‘సుజనుల సహవాసంబున గుజనులు సద్ధర్మమతులగుట నిక్కము’ సజ్జనులతో స్నేహం చేయడం వలన దుర్జనులు కూడా సుజనులు అయి తీరతారని నన్నయ భారతం ఆదిపర్వంలో చెబుతున్నాడు. శ్రీకృష్ణునితో సాన్నిహిత్యం కారణంగానే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు పాండవులు.
- డా. పురాణపండ వైజయంతి-
