
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. కృష్ణా జిల్లా విజయవాడలో 28 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం ప్రకటించింది. ఈ నెల 18న స్వీడన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆ యువకుడు.. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ లో గన్నవరం వచ్చాడు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి క్యాబ్ లో ఇంటికి చేరుకున్నాడు. వారం రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బుధవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా.. కరోనా ఉందని తేలింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు. విజయవాడలో ఇది మూడో కేసు.
. ఇవాళ వచ్చిన కేసుతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11కు చేరింది. అయితే ఇందులో తొలి పేషెంట్ అయిన నెల్లూరు యువకుడు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 190 దేశాలకు విస్తరించిన ఈ వైరస్ 4 లక్షల 94 వేల మందికి సోకగా.. 22 వేల మందికిపైగా దీనికి బలయ్యారు. ఇక భారత్ లో 720 కేసులు నమోదు కాగా.. అందులో 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు.