హైదరాబాద్ : మరో నాలుగు కొత్త బస్ డిపోలు?

హైదరాబాద్ : మరో నాలుగు కొత్త బస్ డిపోలు?
  • పాత డిపోల్లో  120 నుంచి 130 బస్సులు 
  • స్థలాభావం, డిపోకు బస్సులు   చేర్చడానికి అధిక సమయం  
  • ఆరు నెలల్లో 300 కొత్త బస్సులు 
  • ఓఆర్​ఆర్​ పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​లో కొత్తగా మరో నాలుగు బస్​డిపోలను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. పెరుగుతున్న బస్సుల సంఖ్యతో పాటు ట్రాఫిక్​సమస్యల వల్ల ఇప్పుడున్న డిపోలపై ఒత్తిడి పెరుగుతోందని అందుకే బస్​డిపోల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేసినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

ప్రస్తుతం గ్రేటర్​లో 24 బస్​డిపోలుండగా, 3,043 బస్సులున్నాయి. ఒక్కో డిపోలో 120 నుంచి 130 బస్సులను ఉంచుతున్నారు. దీంతో స్థలం సరిపోవడం లేదు. సర్వీసులు పూర్తయ్యాక రాత్రి వేళ బస్సులను డిపోలకు చేర్చడానికి అధిక సమయం పడుతోంది. దీంతో పాటు మరో 6 నెలల్లో సిటీకి మరో 300 కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉండడంతో  కొత్త బస్​ డిపోలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

ఓఆర్ఆర్​ పరిసర ప్రాంతాల్లో..

ఓఆర్ఆర్​పరిసర ప్రాంతాల్లోనే కొత్త డిపోలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే ఈ బస్​డిపోలకు100 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న బస్​డిపోల్లో బస్సులను నిలపడానికి సరైన వసతులు లేవని, విశాలమైన ప్రాంగణాలు అవసరం కాబట్టి కొత్త డిపోలను ఔటర్​కు దగ్గరగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా డిపోల్లో చార్జింగ్​ పాయింట్లను కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటున్నారు.