
- స్కూటీని ఢీ కొట్టిన బీఎండబ్ల్యూ
- భార్య మృతి.. భర్తకు గాయాలు
- ముంబైలోని వర్లీలో ఘటన
- కారు నడిపింది శివసేన లీడర్ కొడుకేనంటున్న స్థానికులు
ముంబై: స్కూటీపై వెళుతున్న భార్యాభర్తలను వెనక నుంచి వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. దీంతో స్కూటీ మీదున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆగకుండా నిందితులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ లగ్జరీ కారు ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి చెందిన లీడర్దిగా పోలీసులు గుర్తించారు. నాగ్పూర్ హిట్ అండ్ రన్ కేసు తరహాలో ఆదివారం ముంబైలోని వర్లీ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది.
భార్యభర్తలు స్కూటీ మీద వస్తుండగా..
వర్లీలోని కోలివాడకు చెందిన దంపతులు కావేరీ, ప్రదీప్ నఖ్వా చేపల వ్యాపారం చేస్తుంటారు. రోజూలాగే ఆదివారం తెల్లవారుజామున ససూన్ డాక్లో చేపలు కొనుక్కుని తిరిగి వస్తుండగా వీళ్ల స్కూటీని ఓ బీఎండబ్ల్యూ కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ కారు బానెట్ మీద పడిపోయారు. భర్త ప్రదీప్ వెంటనే కిందపడిపోగా, కావేరీ బానెట్పైనే పడి ఉంది. అయినా కారు ఆగకుండా వంద మీటర్ల వరకూ కావేరీని లాక్కెళ్లింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. ప్రదీప్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ కారు పాల్ఘర్ జిల్లా శివసేన లీడర్ రాజేశ్ షాదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని, కారు నడిపింది మాత్రం రాజేశ్షా కొడుకు మిహిర్ షా అని స్థానికులు చెబుతున్నారు.