- జర్మనీకి చెందిన గ్లాట్, ప్రిఫర్ కో సంస్థల ఆధ్వర్యంలో జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానుంది. జర్మనీకి చెందిన గ్లాట్, ప్రిఫర్ కో సంస్థలు కలిసి బయోప్రాసెస్ విస్తరణకు సంబంధించి జీనోమ్ వ్యాలీలో ఈ సీవోఈని ఏర్పాటు చేస్తున్నాయి. రిచ్ సీఈవో రష్మీ పింపలే సమక్షంలో బయో ఏషియా సదస్సు వేదికగా రెండు సంస్థలు ఈ ప్రకటన చేశాయి. బయోప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటును ఈ సీవోఈ మరింత పటిష్ఠం చేస్తుందని రష్మీ తెలిపారు. బయోఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ రంగాన్ని ఇది మరింతగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తుందన్నారు.
ఇందులో భాగంగా మైక్రోబియల్ ఫెర్మెంటేషన్ కోసం1,500 లీటర్ల బయోరియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. పూర్తి ఆటోమేషన్, అధునాతన పరికరాలు, ఏఐ ప్రాసెస్ సపోర్ట్ వంటి వాటితో ఫెర్మెంటేషన్ను ఎఫిషియెంట్గా నిర్వహించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బయో ఈ3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్)కు అనుగుణంగా సీవోఈ పని చేస్తుందని అంటున్నారు.
