బెల్లంపల్లిలో మరో ల్యాండ్​ స్కామ్

బెల్లంపల్లిలో మరో ల్యాండ్​ స్కామ్
  • మాదంటే మాదంటున్న రెండు వర్గాలు
  • రంగంలోకి రూలింగ్​ పార్టీ లీడర్లు
  • సెటిల్​ చేస్తామని ఒక వర్గంతో 60 : 40 అగ్రిమెంట్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ భూ దందాలకు కేరాఫ్​గా మారుతోంది. తాజాగా మరో ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఐదు ఎకరాల సర్కారీ ల్యాండ్​మాదంటే.. మాదంటూ రెండు వర్గాలు ఆక్రమించేందుకు ట్రై చేస్తున్నాయి. ఈ వివాదాన్ని ఆసరా చేసుకున్న స్థానిక టీఆర్ఎస్ ​లీడర్లు ఒక వర్గంతో ‘మీకే వచ్చేలా సెటిల్​ చేస్తానని.. అందుకు ల్యాండ్​లో 40% తమకు ఇవ్వాలని’ డీల్
కుదుర్చుకున్నారు. అలా తమకు వచ్చే భాగంలో అర ఎకరం అమ్ముకుని రూ.లక్షలు వెనకేసుకున్నారు. ఆఫీసర్లు చోద్యం చూస్తుంటే.. అధికార పార్టీ లీడర్ల అండతో కబ్జాలు పెరిగిపోతున్నాయి.

బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్​ఎదురుగా సర్వే నంబర్170పీపీలో 5 ఎకరాల ల్యాండ్​ఉంది. దాన్ని ఇప్పటికే టీఆర్ఎస్​కౌన్సిలర్ ఒకరు ఫేక్​డాక్యుమెంట్లతో ఆక్రమించుకుని ఫ్లాట్లు వేశాడు. అమ్మకాలు స్టార్ట్​చేశాడు. దాని వెనుకాలే ఉన్న ప్రార్థనా మందిరం పక్కన మరో ఐదు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది మాదంటే మాదంటూ రెండు వర్గాలు కొన్నేళ్లుగా గొడవ పడుతున్నాయి. ప్రస్తుతం అది కాస్త ముదిరింది. తమ పూర్వీకుల పేరుతో ఉన్న భూమి తమకే చెందాలని ఒక వర్గం వాదిస్తుంటే.. 20 ఏండ్ల కిందట సర్కారే తమకు ఆ ల్యాండ్​ను అసైన్​చేసిందని మరో వర్గం చెబుతోంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయంటూ ఇరువురూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా రూ.కోట్లు విలువైన 5 ఎకరాలు కొట్టేసేందుకు ఎవరికి వారు గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ అది ప్రభుత్వ భూమే అని రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే రిటైర్డ్​సింగరేణి ఎంప్లాయ్ ఫ్యామిలీలోని ముగ్గురికి ఎకరం నాలుగు గుంటల చొప్పున అసైన్డ్​ల్యాండ్ ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా ప్రస్తుతం ఒక వర్గానికి చెందినవారు. వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవా లేక బోగస్​అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ల్యాండ్ కు దగ్గరలో ఉన్న 5 ఎకరాలను ఆక్రమించుకున్న టీఆర్ఎస్​కౌన్సిలర్​ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో దీనిపైనా హైకోర్టులో కేసు వేశాడు. కోర్టు స్టే ఇచ్చింది.

ప్లాట్లు కొన్నవారిలో ఆందోళన

టీఆర్ఎస్​ లీడర్ల జోక్యంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ప్లాట్లు కొన్నవారు ఆందోళనలో ఉన్నారు. 170 పీపీలోని రిజిస్ట్రేషన్లు చేసేందుకు చాన్స్​లేదు. కేవలం వైట్​పేపర్లపై అమ్మినట్లు, కొన్నట్లు సంతకాలు చేసుకున్నారు. ఒకవేళ ఫ్యూచర్​లో ప్రభుత్వం ల్యాండ్​ను స్వాధీనం చేసుకుంటే తమ పరిస్థితి ఏందని వాపోతున్నారు.

అర ఎకరం స్వాహా

ఈ రెండు వర్గాల మధ్యలోకి తాజాగా రూలింగ్​ పార్టీకి చెందిన లీడర్లు ఎంటర్ అయ్యారు. ఒక వర్గానికి అనుకూలంగా సెటిల్​మెంట్​చేస్తామని 60:40 డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ప్రాబ్లమ్​సాల్వ్ అయితే భూమిలో 40% ల్యాండ్ ఇవ్వాలన్నది అగ్రిమెంట్. ఎప్పటికైనా అది తమదేలే అని అనుకున్నారో ఏమో డీల్​ప్రకారం వచ్చే భూమిలోని అర ఎకరాన్ని రూలింగ్​పార్టీ లీడర్లు అమ్మేసుకున్నట్లు తెలిసింది. అమ్మకాన్ని అడ్డుకున్న మరో వర్గంపై జనవరిలో కేసులు పెట్టి బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుకుబడి ఉన్న వర్గం, అధికార పార్టీ లీడర్లు కలిసి కబ్జా చేస్తుంటే.. అధికారులు ఫెన్సింగ్​తొలగించి చేతులు దులుపుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. దీనిపై సీరియస్ యాక్షన్​ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

2 వేల కోట్లతో సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతలు

వెల్లుల్లి క్యాప్సూల్స్ తయారీ యోచనలో ఉద్యాన శాఖ

ఐదు ఆప్షన్స్​, నాలుగు బబుల్స్​..NMMS ఎగ్జామ్‌లో బ్లండర్

రేషన్ ​కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు