20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో  తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరో 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో అది మరింత బలపడే అవకాశం ఉంది. 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూరగాయలు, పత్తి పంట చేతికొచ్చే సమయంలో వానలు పడటంతో కాయలు కుళ్లిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక హైదరాబాద్ లో అయితే వాతావరణం విచిత్రంగా ఉంటుంది. ఉదయం మబ్బుల్లో సూర్యుడు దాగుడు మూతలు ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు. అలా వచ్చి..ఇలా వెళ్లిపోతున్నాడు. ఇక సాయంత్రం అయిందంటే చాలు నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షం దంచికొడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్ష బీభత్సానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే వరద ఉధృతికి బైక్ లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో వద్దంటే వానలు పడుతున్నాయి. మబ్బు కనిపిస్తే చాలు వాన వచ్చి వాలిపోతుందా అన్నట్టు దంచికొడుతోంది. చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు మత్తడి దూకడంతో పంట పొలాలు నీటమునిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేసి రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.