
జూబ్లీహిల్స్ బాలిక ఘటన మరువక ముందే సికింద్రాబాద్ పరిధిలో మరో దారుణం జరిగింది. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే పదో తరగతి చదువుతున్న బాలికతో ధీరజ్, రితేష్ అనే యువకులు ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన ఇద్దరు నిందితులు బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోలను చూపించి బెదిరిస్తూ తమ స్నేహితులైన శ్రిజిత్, హర్షిత, శౌర్య లతో కలిసి బాలికపై పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు నెలలుగా పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మే 30న కార్ఖానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు చెప్పారు.