అక్కచెల్లెళ్లపై రెండేండ్లుగా అఘాయిత్యం

అక్కచెల్లెళ్లపై రెండేండ్లుగా అఘాయిత్యం
  • అక్కచెల్లెళ్లపై రెండేండ్లుగా అఘాయిత్యం
  • సికింద్రాబాద్​ చిలకలగూడలో దారుణం
  • నిందితులిద్దరూ పాత నేరస్తులే..
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు

సికింద్రాబాద్​, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో ట్రాప్​చేసి మైనర్లు అయిన అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలగూడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఒకడు ఇన్​స్టాగ్రామ్​తో ట్రాప్​ చేయగా.. మరొకడు పరిచయం పెంచుకుని లొంగదీసుకున్నాడు. అక్కా చెల్లెలు వేర్వేరుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నా.. ఒకరి లవర్​ ఇంకొకరికి తెలియదు. ఇద్దరి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు వారిని నిలదీయగా.. అసలు విషయం బయటికొచ్చింది. చిలకలగూడ ఇన్​స్పెక్టర్​ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్​ అంబర్​పేట్​కు చెందిన మహ్మద్​ నవాజ్​(21) ఆటో డ్రైవర్​. ఇతడిపై పలు పీఎస్​లలో కేసులు నమోదవ్వగా.. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. చిలకలగూడ పీఎస్​ పరిధిలోని వారాసిగూడలో నివాసం ఉండే ఓ మైనర్​ బాలిక (17)తో మహ్మద్​ నవాజ్​ ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం పెంచుకున్నాడు. ఇన్​స్టాలో చాటింగ్​ చేస్తూ ప్రేమ పేరుతో వల వేశాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. లొంగదీసుకున్నాడు. రెండేండ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. అంబర్​పేటకు చెందిన మహ్మద్​ ఇంతియాజ్​ అహ్మద్​ (23) గతంలో వారాసిగూడ అంబర్​నగర్​లో ఉండేవాడు. ప్లంబర్​ పని చేసే ఇంతియాజ్, ఆ సమయంలో బాధితురాలి చెల్లి (16)తో పరిచయం పెంచుకున్నాడు. బాలిక కోసం ఇంతియాజ్​ తరచూ వారాసిగూడ అంబర్​నగర్​కు వచ్చేవాడు. బాలికతో పరిచయం మరింత పెరిగింది. ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండేండ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. పలు పోలీస్​ స్టేషన్స్​పరిధిలో నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినా మారలేదు. దీంతో పోలీసులు పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. మైనర్లైన అక్కాచెల్లెళ్లపై ఇద్దరు, ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారం చేశారు. 

విషయం బయటికొచ్చిందిలా..
అక్కా చెల్లెళ్లు ఇద్దరూ వేర్వేరుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నా.. ఒకరి లవర్​ ఇంకొకరికి తెలియదు. ఇద్దరూ తరుచూ బయటికి వెళ్లడాన్ని గమనించిన తల్లిదండ్రులు మందలించారు. కాలు బయటపెట్టొద్దని హెచ్చరించారు. దీంతో తన ప్రేమ వ్యవహారం అక్క చెప్పిందేమోనని చెల్లె, తన ప్రేమ గురించి తండ్రికి చెప్పిందేమోనని అక్క.. ఇలా ఒకరిపై ఒకరు అనుమానం  పెంచుకున్నారు. ఇదే క్రమంలో  అక్కా చెల్లెళ్లు ఇద్దరూ  ఒకరికి తెలియకుండా ఇంకొకరు తండ్రికి ఒకరిపై ఒకరు చాడీలు చెప్పడం మొదలు పెట్టారు. అక్క ఎవరితోనే తిరుగుతుందని చెల్లె, చెల్లె ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని అక్క.. ఇలా ఒకరిపై ఒకరు చాడీలు చెబుతూ వచ్చారు. విసిగిపోయిన తండ్రి, పెద్దమ్మాయిని మందలించాడు. బెదిరిస్తే సూసైడ్​ చేసుకుంటానని పెద్దమ్మాయి బెదిరింపులకు దిగింది. దీంతో వీరి ప్రవర్తనపై  అనుమానం వచ్చిన  ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. ఇద్దరినీ  కౌన్సిలింగ్​ కోసం భరోసా  కేంద్రానికి పంపించగా.. విషయం బయటికొచ్చింది. తమపై రెండేండ్లుగా జరుగుతున్న అత్యాచారంపై అక్కా చెల్లెళ్లు ఇద్దరు భరోసాకేంద్రంలో వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులపై  అత్యాచారం,  పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు పంపారు.


ఇద్దరిపై గతంలోనే పీడీ యాక్టు
అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన మహ్మద్​ నవాజ్​, మహ్మద్​ ఇంతియాజ్​ పాతనేరస్తులు. జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి బయటకొచ్చి తిరిగి నేరాలు చేస్తుండటంతో పీడీయాక్టు నమోదుచేసి జైలుకు పంపగా.. 2019లో విడుదలయ్యారు. మహ్మద్​ నవాజ్​పై  మలక్​పేట, అంబర్​పేట్​,  చిలకలగూడ పీఎస్​ల పరిధిలో ఆరు  కేసులు నమోదయ్యాయి. అలాగే ఇంతియాజ్​పై చిలకలగూడ , నల్లకుంట, బేగంపేట్​, చిక్కడపల్లి, ముషీరాబాద్​, పంజాగుట్ట పీఎస్​లలో 23 కేసులు ఉన్నాయి.