కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మరో ఉద్యమం : ఎంపీ లక్ష్మణ్

కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మరో ఉద్యమం : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అవినీతికి, కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మేధావులతో పాటు వివిధ వర్గాల వారు తెలంగాణ కోసం ఎలా పోరాడారో.. ఇప్పుడు అదే మాదిరి తెలంగాణ సమా జాన్ని కాపాడుకునేందుకు గొంతెత్తాలని, ప్రశ్నించాలని కోరారు. లేకుంటే సమాజానికి తీవ్రమైన అన్యాయం చేసిన వారవుతారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి సొమ్మును కక్కించే వరకు వారిని వదిలిపెట్టవద్దని ప్రజలను కోరారు. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత శనివారం తొలిసారి పార్టీ స్టేట్ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు లక్ష్మణ్ శాలువా కప్పి, బొకే అందించి స్వా గతం పలికారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీతోనే మార్పు సాధ్యమని చెప్పారు. ఇప్పుడున్న తెలంగాణతో శ్రీకాంతాచారి ఆత్మ ఘోషిస్తున్నదన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని, ఏ తప్పు చేయని వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కి ఫ్యామిలీ ఫస్ట్: మర్రి శశిధర్ రెడ్డి

రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా ఉంటాయని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రజలకు తామున్నామనే భరోసా ఇచ్చిన పార్టీ బీజేపీనే అని చెప్పారు. ‘‘బీజేపీకి తెలంగాణ ఫస్ట్.. గవర్నెన్స్ ఫస్ట్. కానీ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఫ్యామిలీ ఫస్ట్, ఫాదర్ ఫస్ట్, ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్” అని విమర్శించారు. ఏ పార్టీ అయినా గెలవాలంటే నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉండాలని, అది మోడీకే సాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు.

బస్తీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం సాయం త్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు బస్తీల్లో పాదయాత్ర చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేయడం కాదని, బస్తీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. 

బీజేపీ వైపు చూస్తున్నరు: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తు న్నా రని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శశిధర్ రెడ్డి చేరికతో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో బీజేపీ మరింత బలపడుతుందని, ఆయన సేవలను పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుందని తెలిపారు. శశిధర్ రెడ్డి అనుభవమున్న నేత అని, రాష్ట్రంలో ఆయన కుటుంబం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరన్నారు. శశిధర్ రెడ్డి నాయకత్వంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో సనత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.