పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయ్యింది. 2025, డిసెంబర్ 11న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల‎పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కావాలనే రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబాద్‌కు చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం తరఫున ఎస్‌.లక్ష్మి, మరో ఆరుగురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌‎తో కూడిన బెంచ్‌.. గ్రామ పంచాయతీల ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది. 

ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జీవో 46పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. 6 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత 2 వారాల్లో పిటిషనర్‌‌‌‌‌‌‌‌ రిప్లయ్‌‌‌‌‌‌‌‌ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్​తోపాటు డెడికేటెడ్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. 

వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా నవాబ్‌‌‌‌‌‌‌‌పేట మండలం అత్తాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన జి.రమేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన మరో పిటిషన్‌‌‌‌‌‌‌‌లోనూ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. జీవోపై స్టే ఇస్తే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్టే అవుతుందని తెలిపింది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‎పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది.