మరో రామాలయం ఒడిశాలో ప్రారంభం

 మరో రామాలయం  ఒడిశాలో ప్రారంభం

 న్యూఢిల్లీ :  అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన రోజే.. మన దేశంలో మరోచోట రామాలయం ప్రారంభించారు. ఒడిశా నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్ లో కొండపైన నిర్మించిన రామాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఇది అయోధ్యకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 73 అడుగుల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉంది. 2017లో ఆలయం నిర్మాణం ప్రారంభించగా.. ఏడేండ్లు 150 మందికి పైగా కార్మికులకు శ్రమించి, ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ గుడిని పూర్తిగా భక్తుల విరాళాలతోనే కట్టారు. 

నిర్మాణానికి అయిన ఖర్చులో సగం ఫతేగఢ్ ప్రజలే సమకూర్చారు. ఈ గుడిని కోణార్క్ ఆలయ నిర్మాణ శైలిలో కట్టారు. ప్రధాన ఆలయానికి పక్కన సూర్య భగవానుడు, శివుడు, గణేశుడు, హనుమంతుడి ఆలయాలను నిర్మించారు. కాగా, ఈ గుడికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. పూరీ జగన్నాథ ఆలయంలో  1912లో నిర్వహించిన ‘నబకళేబర్’ కోసం ఇక్కడి నుంచి చెక్కను సేకరించారు. దీనికి గుర్తుగా ఇక్కడ గుడి కట్టాలని గ్రామస్తులు భావించి, శ్రీరామ్ సేవా పరిషత్ కమిటీని ఏర్పాటు చేశారు.