మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్ ఎలీనా రిబకినా (కజకిస్తాన్) 7–5, 6–1తో రెండో సీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్)కు షాకిచ్చింది. దాంతో 2023 తర్వాత రిబకినా తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించింది.
ఈ మ్యాచ్ ఆరంభంలో ఇద్దరు ప్లేయర్లు సర్వీస్‌లు కాపాడుకోవడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే 12వ గేమ్‌లో స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబకినా ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడినుంచి ఆటపై పట్టు బిగించింది. గంటా 35 నిమిషాల మ్యాచ్‌లో కజక్ ప్లేయర్ 11 ఏస్‌లు, 26 విన్నర్లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. తన సర్వీస్‌లో 79 శాతం పాయింట్లు రాబట్టింది. ఏడు బ్రేక్ పాయింట్లలో నాలుగు కాచుకుంది.
స్వైటెక్ 3 ఏస్‌లు, ఒక డబుల్ ఫాల్ట్, 10 విన్నర్లకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో ఆరోసీడ్ జెస్సికా పెగులా (అమెరికా) 6–2, 7–6 (7/1)తో అమండా అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్ యానిక్ సినర్ (ఇటలీ) 6–3, 6–4, 6–4తో 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై గెలవగా.. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అదృష్టంతో సెమీస్‌లోకి దూసుకెళ్లాడు.
క్వార్టర్స్‌లో జొకో 4–6, 3–6, 3–1 ఉన్న దశలో ఐదోసీడ్ లోరెంజో ముసెట్టి (ఇటలీ) గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. తొలి రెండు సెట్లను ఈజీగా నెగ్గిన ముసెట్టి.. మూడో గేమ్‌లో కుడి కాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. వెంటనే మెడికల్ టైమౌట్ తీసుకుని బరిలోకి దిగినా ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో జొకోకు వాకోవర్ విజయం లభించింది. సెమీస్‌లో అతను డిఫెండింగ్ చాంపియన్ సినర్‌తో పోటీ పడతాడు.
నేడు విమెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్
* సబలెంక X స్వితోలినా
* పెగులా X రిబకినా
* మ. 2 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
