బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ బయటికొచ్చింది. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి ఉన్న లింక్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు విచారణలో గుర్తించారు.
అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. అభిషేక్ సింగ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వద్ద రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అభిషేక్ సింగ్పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పైలెట్రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ చీఫ్‌గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్‌స్టర్ సెటిల్‌మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి.. 3 నెలల్లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సిట్ దర్యాప్తు మొదలైంది.
రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ మినహా మిగిలిన 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు.
కౌశిక్ రవి ఎంత మొత్తంలో డ్రగ్స్ తెచ్చాడు, పార్టీలో ఎంత వినియోగించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధానంగా నమిత్ శర్మకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు జైలులో ఉండగా, కౌశిక్ రవి, పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డిని 45 రోజుల పాటు డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ మహేశ్ యాదవ్ ఏప్రిల్ 4న విచారణకు హాజరవుతానని పోలీసులకు తెలిపారు.
