ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు

 ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా బారికేడ్లు తోసేసి.. పోలీసులపైకి వాటర్ బాటిళ్లు.. మొక్కలను విసిరేసి వాగ్వాదాలకు దిగుతున్నారు. కనీసం మాస్కులు ధరించకుండా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వేలాది మంది గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి శనివారం ఆందోళనలు చేపట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. సిడ్నీ నగరమంతటా శనివారం నాడు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమకు స్వేచ్ఛ కావాలని.. కరోనా వైరస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం బందీలుగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఫ్రీడమ్.. ది ట్రూత్ నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శించారు. 
సిడ్నీ నగరంలోని విక్టోరియా పార్కు నుంచి సెంట్రల్ బిజెనెస్ టౌన్ హాలు వరకు వేలాది మంది ప్రజలు గుంపులు గుంపులుగా.. సోషల్ డిస్టెన్స్ కాదు కదా కనీసం మాస్కులు ధరించకుండా పెద్ద పెద్ద ప్లకార్డులను ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాక్ డౌన్ వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. భారీ సంఖ్యలో ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టడం సాధ్యం కాకపోవడంతో సాయుధులైన పోలీసులు గుర్రాలపై ఫాలో అయ్యారు. 
అదను చూసి ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారు తీవ్రంగా అడ్డుకుని ఎదురుదాడికి దిగారు. ప్లాస్టిక బాటిళ్లు.. పూల కుండీలు.. చెట్ల కొమ్మలను పోలీసులపైకి విసిరేశారు. దీంతో అనుమతి లేకుండా నిరసనలు చేపట్టారనే ఆరోపణతో పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని.. ప్రజల భద్రత కోసమే తాము ప్రాధాన్యతనిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.