90 శాతం మందిలో యాంటీబాడీలు

90 శాతం మందిలో యాంటీబాడీలు
  • ఎన్ఐఎన్ సీరో సర్వేలో వెల్లడి 
  • హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే అంటున్న డాక్టర్లు
  • త్వరలో ఫలితాలు విడుదల చేస్తామన్న సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 90 శాతం మందిలో పుష్కలంగా యాంటీబాడీలు ఉన్నట్టు ఎన్‌‌‌‌ఐఎన్ సీరో సర్వేలో తేలింది. జనవరిలో చేసిన ఈ సర్వే ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 330 గ్రామాల్లో ఈ సర్వే జరిగింది. దాదాపు 16 వేల మంది బ్లడ్ శాంపిళ్లను సేకరించి, యాంటీబాడీ టెస్టులు చేశారు. వీరిలో ఆడ, మగ, చిన్నాపెద్ద అందరూ ఉండేలా చూసుకున్నారు. హెల్త్ కేర్ వర్కర్లలో యాంటీబాడీలు ఎట్ల ఉన్నాయో తెలుసుకునేందుకు అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నోళ్లు, హాస్పిటళ్లలో పని చేస్తున్న స్టాఫ్ శాంపిళ్లను పరీక్షించారు. టీకా తీసుకున్నోళ్లను ఒక గ్రూపుగా, తీసుకోనోళ్లను ఒక గ్రూపుగా విభజించి స్టడీ చేశారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 90 శాతానికి పైగా జనాల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తేలిందని సర్వే చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య ‘‘వెలుగు’’కు తెలిపారు. ప్రభుత్వ అనుమతితో పూర్తి వివరాలు నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. అర్బన్, రూరల్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని జనాల్లోనూ యాంటీబాడీలు ఉన్నాయని పేర్కొన్నారు.  

ఇక వైరస్ ప్రభావం తక్కువే..  
ఏదైనా ఒక వైరస్‌‌‌‌కు వ్యతిరేకంగా 60 లేదా 70 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కరోనా యాంటీబాడీలు ఏకంగా 90 శాతం మందిలో ఉన్నట్టు తేలింది. కాబట్టి రానున్న రోజుల్లో కరోనా ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చునని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. జనవరిలో వచ్చిన థర్డ్ వేవ్‌‌‌‌ లో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ మందికి సోకినప్పటికీ, దాని ప్రభావం తక్కువ ఉండడం మేలు చేసిందని నిపుణులు అంటున్నారు. 
90% మందిలో యాంటీబాడీలు

ఈ వేరియంట్ కారణంగా రాష్ట్రంలో సగం మందికి పైనే ఇన్‌‌‌‌ఫెక్ట్ అయ్యారు. జలుబు వచ్చిపోవడం, పెద్దగా ఎవరినీ ఇబ్బంది పెట్టకపోవడంతో థర్డ్ వేవ్ ప్రభావం దవాఖాన్లపై పెద్దగా కనిపించలేదు. ఇలా ఒక బలహీనమైన వేరియంట్ వచ్చిపోవడం వల్ల, వ్యాక్సిన్ తీసుకోని వారిలో సహజమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఇది ఒక రకంగా కలిసొచ్చే అంశమేనని డాక్టర్లు చెబుతున్నారు. కొత్త వేరియంట్ల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనప్పటికీ, ఒమిక్రాన్‌తో వచ్చిన ఇమ్యూనిటీ జనాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. 

నాలుగో రౌండ్‌‌‌‌లో 60 శాతం 
రాష్ట్రంలో ఇప్పటివరకు 5సార్లు సీరో సర్వేలు చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత 2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మూడో రౌండ్ సర్వేలో 24.1% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. 2021 జనవరి మూడో వారం నుంచి వ్యాక్సినేషన్‌‌‌‌ మొదలు కాగా, మార్చి నుంచి సెకండ్ వేవ్‌‌‌‌ మొదలైంది. డెల్టా వేరియంట్ ప్రభావంతో చాలా మంది ఇన్‌‌‌‌ఫెక్ట్ అయ్యారు. అదే ఏడాది జూన్‌‌‌‌లో నాలుగో రౌండ్ సీరో సర్వే జరిగింది. ఈ సర్వేలో ఏకంగా 60.1 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టుగా తేలింది. అప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న 94 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. సింగిల్ డోసు వేయించుకున్న 78.5% మందికి, వ్యాక్సిన్ వేయించుకోని వారిలో 51.3% మందికి యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. తొలుత వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులు బూస్టర్ డోసు తీసుకుంటుండగా, పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 

ప్రస్తుతం కేసులు తక్కువే.. 
రాష్ట్రంలో ప్రస్తుతం రోజూ 60 నుంచి 80 కేసులు మాత్రమే నమోదవుతున్నట్టు హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ చెబుతోంది. 15 రోజుల నుంచి ఒక్క కరోనా డెత్ కూడా నమోదు కాలేదని శుక్రవారం నాటి బులెటిన్‌‌‌‌ లో తెలిపింది.