రాష్ట్రంలో యాంటీజెన్ టెస్టులు షురూ

రాష్ట్రంలో యాంటీజెన్ టెస్టులు షురూ

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలో యాంటీ జెన్​ టెస్టులు మొదలయ్యాయి. జస్ట్​ అరగంటలోనే రిజల్ట్స్​ ఇచ్చే ఈ టెస్టులను గ్రేటర్​ హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లోని కొన్ని దవాఖాన్లలో ప్రారంభించారు. మొదటి రోజు ఒక్కో చోట 10 నుంచి 25 శాంపిల్స్​ మాత్రమే తీసుకున్నారు. రియల్​టైం ఆర్టీపీసీఆర్​ (రివర్స్​ట్రాన్స్​క్రిప్షన్​ పాలిమరేస్​ చైన్​ రియాక్షన్​) టెస్టు లాగానే యాంటీ జెన్​ టెస్టులకూ ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్​ రీజియన్​) నుంచి స్వాబ్​లతో శాంపిళ్లను తీసుకుంటారు. ఆర్టీపీసీఆర్​‌లో వైరస్​ జీన్​ను గుర్తిస్తే.. ఈ యాంటీజెన్​ టెస్టులో వైరస్​ ప్రొటీన్​ను గుర్తిస్తారు. కరోనా సోకిన తర్వాత పది నుంచి 14 రోజుల పాటు యాంటీజెన్​ ప్రొటీన్​ మన శరీరంలో ఉంటుంది. లక్షణాల్లేని పేషెంట్లలో పది రోజుల వరకు, లక్షణాలున్నోళ్లలో 14 రోజుల వరకూ ఉంటుంది. ఈ టెస్టులో పాజిటివ్​ వస్తే వైరస్​ ఉన్నట్టే లెక్క. ఒకవేళ వైరస్​ లక్షణాలు ఉండి నెగెటివ్​ వస్తే మాత్రం మళ్లీ ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ చేస్తారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​లోనూ పేర్కొంది. నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ అక్రెడిటేటెడ్​ హాస్పిటల్స్​(ఎన్​ఏబీహెచ్​) అన్నింటికీ ఈ టెస్టులు చేసే అవకాశం ఇవ్వాలని పోయిన నెల 14న ఇచ్చిన గైడ్​లైన్స్​లో ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కంటెయిన్​మెంట్​ జోన్లలో ఉన్నవాళ్లకు, ఆపరేషన్లకు ముందు పేషెంట్లకు, డెలివరీలకు ముందు గర్భిణులకు, వృద్ధులకు ఈ టెస్ట్​ చేయడం ద్వారా వైరస్​ వ్యాప్తి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని సూచించింది. ఈ టెస్టులు, రిజల్ట్​ వివరాలనూ ఐసీఎంఆర్​కు తప్పనిసరిగా చెప్పాలి.

ఇంకొన్ని రోజుల్లో యాంటిబాడీ టెస్టులు

రాష్ట్రంలో కరోనా ఎంతమందికి వచ్చి పోయిందో తెలుసుకునేందుకు యాంటీ బాడీ టెస్టులు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్​లోని ప్రివెంటివ్​ మెడిసిన్​ ఇనిస్ట్యూట్స్​లో టెస్టులు చేసేందుకు పరికరాలనూ పెట్టించింది. కరోనా పోరులో ముందున్న డాక్టర్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులకు ముందుగా ఈ టెస్టులు చేయనున్నారు. ఏదైనా వైరస్​గానీ, బ్యాక్టీరియాగానీ మన శరీరంలోకి ఎంటరైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మన రోగ నిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను పుట్టిస్తుంది. ఈ యాంటీ బాడీలు ఆ రోగకారక క్రిములతో పోరాడి నిర్వీర్యం చేస్తాయి. రక్తంలో ఈ యాంటీ బాడీస్​ 5 రకాలుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఐజీఎం, ఐజీజీలు. ఏదైనా క్రిమి ఎంటరయ్యాక ముందు ఐజీఎం యాంటీ బాడీలు పుడతాయి. ఆ క్రిమితో ఫైట్​ స్టార్ట్​ చేస్తాయి. 22 రోజుల వరకు రక్తంలో ఉంటాయి. క్రిమి ఎంటరయ్యాక 10 రోజులకు ఐజీజీ యాంటీబాడీలు పుడతాయి. ఇవి 6 నెలల వరకు ఉంటాయి. ఆ క్రిమిని అంతం చేయడంలో వీటిదే ముఖ్య పాత్ర. వీటిలో మళ్లీ 4 రకాలుంటాయి. రక్తంలోని సీరమ్​ను టెస్ట్​ చేయడం ద్వారా ఈ ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల ఉనికి తెలుసుకోవచ్చు. టెస్టులో ఐజీఎం యాంటీబాడీస్​  పాజిటివ్​ వస్తే వైరస్​ సోకి పది రోజుల లోపే అవుతున్నట్టు. ఐజీఎం, ఐజీజీ రెండూ పాజిటివ్​ వస్తే వైరస్ సోకి10 నుంచి 22 రోజులు అవుతున్నట్టు లెక్క. ఐజీజీ యాంటీబాడీసే పాజిటివ్​ వస్తే వైరస్​ వచ్చి నయమైపోతున్నట్టు లేదా పూర్తిగా నయమైపోయినట్టు భావిస్తారు.

పాడుబడ్డ సెక్రటేరియట్ లోనే సంసారం చేయాలా?