బంగారు గొలుసు లాక్కెళ్లిన చీమలు

బంగారు గొలుసు లాక్కెళ్లిన చీమలు

ఆకలి పోరాటం మనుషులే కాదు.. ఇతర జీవరాశులూ చేస్తుంటాయి. చీమల దండు కలిసికట్టుగా ఆహార ధాన్యాలను నోట్లో కర్చుకొని తీసుకెళ్లడాన్ని మనం నిత్యం చూస్తుంటాం. పట్టిన పట్టు వదలకుండా ..  ఆహార ధాన్యాలను తమ గూటిలోకి తీసుకెళ్లే చీమల పట్టుదలకు ఫిదా అవుతుంటాం. అలాంటిది ఒక చీమల దండు..  బంగారు వర్ణంలో ఉన్న గొలుసును కష్టపడి లాక్కెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తమ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ బరువున్న గొలుసును అవి ఐకమత్యంతో లాక్కెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

దీన్ని ఐఎఫ్ఎస్ అధికారి సుసాంత నంద ట్విటర్లో షేర్ చేశారు.  ‘వీళ్లు చిన్నపాటి గోల్డ్ స్మగ్లర్లు..  ఐపీసీలోని ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టాలనేది ప్రశ్న’ అని ఆయన కామెంట్ చేశారు. దీనికి స్పందించిన ఒక నెటిజన్..  ‘ఈ చీమల కోసం యానిమల్ ప్రొసీజర్ కోడ్ తేవాలి’ అని వ్యంగ్యంగా బదులిచ్చారు. ఆ చట్టానికి ‘ఇన్సెక్ట్ పీనల్ కోడ్’ అని పేరుపెట్టాలని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘బంగారు గొలుసు తీసుకురావాలని చీమల రాజును చీమల రాణి కోరి ఉంటుంది’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ పోస్ట్కు  రెండు రోజుల్లోనే 1.50 లక్షల వ్యూస్, 4600 లైక్స్ రావడం విశేషం.