ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి

ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి

బెంగళూరు: లోక్ సభ ఎన్నికల్లో  పోలింగ్ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని వివిధ హోటళ్లు వినూత్న ప్రయత్నం చేశాయి. ఓటు వేసి వచ్చినవారికి బటర్ దోశ, లడ్డూ, కాఫీ, జ్యూస్​తో పాటు ఇతర ఆహార పదార్థాలను  ఫ్రీగా అందజేశాయి. దీంతో పలు రెస్టారెంట్ల వద్ద భారీ సంఖ్యలో జనం క్యూ కట్టారు. శుక్రవారం కర్నాటకలోని 14 లోక్‌‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో బెంగళూరు సౌత్, సెంట్రల్, నార్త్, రూరల్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూర్ సిటీలో ఓటింగ్‌‌ను ప్రోత్సహించేందుకు బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్‌‌(బీబీహెచ్ఏ) వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

లోక్‌‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తమ అసోసియేషన్‌‌కు అనుబంధంగా ఉన్న  రెస్టారెంట్లలో తినే ఆహార పదార్థాలను ఫ్రీగా లేదా బిల్లులో డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. ఓటు వేసినట్లు చేతి వేలుకు పెట్టిన సిరా మార్క్​ను చూపించాలని కండీషన్ పెట్టింది. నృపతుంగా రోడ్డులోని నిసర్గ గ్రాండ్ హోటల్.. ఓటు వేసి వచ్చినవారికి బటర్ దోశ, లడ్డూ, జ్యూస్ వంటివి ఉచితంగా అందించింది. 'ఓటు వేయండి-.. ఫుడ్ తినండి' అనే నినాదంతో వీటిని అందించింది. దీంతో ఉదయం నుంచే అనేక మంది ఓటర్లు హోటల్ ముందు బారులు తీరారు. బీబీహెచ్ఏ ప్రెసిడెంట్ పిసి రావు మాట్లాడుతూ.. నగరంలో విద్యావంతులు, యువ ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతోందని తెలిపారు. అందరూ ఓట్లు వేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించామన్నారు.