
- ఈ దిశగా ఈసీకి ఆదేశాలు జారీచేయాలని సుప్రీంలో పిల్
- రిప్లై ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దుచేసేలా ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేరా ఈ పిల్ వేశారు. దీంతో ఈ పిల్ కు రిప్లై ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శివ్ ఖేరా తరపున సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణన్ ఈ పిల్ దాఖలు చేశారు. ముందుగా ఈ పిల్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఈ అంశంపై తేల్చాల్సింది కార్యనిర్వాహక శాఖ అని పేర్కొంది. కానీ, తర్వాత పిల్ ను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఈ పిల్ పై విచారణ జరిపింది. అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ గుజరాత్ లోని సూరత్ లో మిగతా అభ్యర్థులు రేసు నుంచి తప్పుకోవడం, కొంతమంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా లోక్ సభకు ఎన్నికయ్యారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి ఎన్నికపై రిట్ జారీచేయాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు. ఒక నియోజకవర్గంలో అభ్యర్థుల కన్నా నోటాకు మెజారిటీ వస్తే ఆ ఎన్నిక రద్దుచేసేలా రూల్స్ రూపొందించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆ నియోజకవర్గంలో నోటా కన్నా తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు ఐదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా వారిని డిబార్ చేయాలన్నారు. 2013లో ఈవీఎంలలో నోటా బటన్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఉద్దేశమే నెరవేరలేదని శంకరనారాయణన్ తెలిపారు. దానితో పాటు ఓటింగ్ శాతం కూడా పెరగలేదని, రాజకీయ నాయకులు మంచి అభ్యర్థులను నిలబెట్టేలా నోటా చేయలేకపోయిందని ఆయన వివరించారు. ఆయన వాదనలు విన్న బెంచ్.. ఈ పిల్ పై రిప్లై ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీచేసింది.