
అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో క్రిష్ జాగర్లమూడి రూపొందించిన చిత్రం ‘ఘాటి’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక ఫిమేల్ సూపర్ స్టార్‌తో కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనేది మెయిన్ ఐడియా. ‘కర్తవ్యం’ తర్వాత ఆ స్కేల్‌లో మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్ లో అనుష్క గారికి అలాంటి స్టార్ డమ్ ఉంది. దీంతో క్రిష్ ఆమెకు కథ చెప్పగా ఒప్పుకున్నారు. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ స్టోరీ. ఎలాంటి రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్ లేదు. అరకు, గాంజా బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుంది. ఆంధ్ర–ఒరిస్సా బోర్డర్స్‌లో ఎక్కువగా షూట్ చేశాం.
ఒరిస్సా బోర్డర్‌లో షూట్‌కి వెళ్ళేటప్పుడు వేల మంది జనం అనుష్కను చూడ్డానికి వచ్చేవారు. క్రౌడ్‌ని కంట్రోల్ చేయడానికి రెండు మూడుసార్లు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అనుష్క గారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆ స్థాయి ప్రేక్షకాదరణ చూసి ఆశ్చర్యపోయా. ఇందులో ఆమె పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. క్రిష్ మార్క్ డ్రామాతో కంప్లీట్ యాక్షన్ మూవీలా ఉంటుంది. ఇక తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి.. విక్రమ్ ప్రభును ఈ చిత్రంలోకి తీసుకున్నారు క్రిష్. ఆయన అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆడియెన్స్‌కి విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాం’ అని చెప్పారు.