ఏ స్కీమ్‌‌ ఫండ్స్‌‌  దానికే వాడాలె

ఏ స్కీమ్‌‌ ఫండ్స్‌‌  దానికే వాడాలె
  • కేంద్ర పథకాల ఫండ్స్‌‌ విడుదలపై కొత్త ప్రొసీజర్
  • నోడల్‌‌ ఏజెన్సీ పెట్టి పక్కాగా వాడితేనే నిధులు వస్తయ్
  • మొదట 25% నిధులే ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం
  • రాష్ట్ర వాటాతో కలిపి అవి ఖర్చు చేస్తేనే మిగతా ఫండ్స్
  • రాష్ట్రాలు వేరే స్కీమ్స్‌‌కు వాడుతుండటంతో చర్యలు

హైదరాబాద్, వెలుగు: ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే నిధులను రాష్ట్రాలు తమకు నచ్చినట్టు వేరే స్కీమ్స్‌‌కు, ఇతర పనులకు పక్కదారిపట్టించడం కుదరదు. ఏ సెంట్రల్‌‌ స్కీమ్‌‌ కింద నిర్దేశించిన సంక్షేమ లేదా అభివృద్ధి కార్యక్రమం  కోసం ఫండ్స్‌‌ రిలీజ్‌‌ చేస్తే దానికే ఖర్చు చేసి తీరాలి. కేంద్రం ఇచ్చే వాటాకు రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి వాడాలి. లేదంటే తర్వాతి దశల్లో రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. అంతేకాదు మొదట ఇచ్చిన ఫండ్స్‌‌ను కేంద్రానికి  రిటర్న్‌‌ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రాష్ట్ర వాటా లేని సెంట్రల్​ స్కీమ్ అయితే కేంద్రమే నేరుగా జిల్లాలకు, పట్టణాలకు, పంచాయతీలకు, స్కీమ్​ అమలు చేసే ఏజెన్సీలకు నిధులు ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాల (సెంట్రల్‌‌ స్పాన్సర్డ్​ స్కీమ్స్) నిధులు ఇచ్చే విషయంలో ప్రొసీజర్స్​ మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నోడల్‌‌ ఏజెన్సీ పెట్టి ఖర్చు చేయాలె
కేంద్ర పథకాలకు సంబంధించి జారీ చేసిన కొత్త ప్రొసీజర్‌‌‌‌ను జులై 1 నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రొసీజర్స్​ ఫాలో కావాలని ఆదేశిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని ఎక్స్‌‌పెండిచర్ విభాగం రాష్ట్రాల్లోని అన్ని శాఖలకు లేఖలు రాసింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కేంద్ర ప్రాయోజిత స్కీమ్‌‌కు సింగిల్‌‌ విండో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, ప్రతి రూపాయిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నోడల్‌‌ ఏజెన్సీని పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌‌మెంట్‌‌తో రిజిస్టర్‌‌‌‌ చేసి, జీరో బ్యాలెన్స్‌‌ అకౌంట్‌‌తో మొదలుపెడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు బడ్జెట్ లైన్స్ ఓపెన్‌‌ చేస్తారు. ఈ ఏజెన్సీ ఏర్పాటుతో నిధుల వినియోగం పక్కాగా లెక్క తేలుతుంది.

21 రోజుల్లోనే రాష్ట్ర వాటా ఇవ్వాలె
కొత్త ప్రొసీజర్ ప్రకారం ఆర్థిక సంవత్సరం మొదట్లో సెంట్రల్ స్కీమ్స్‌‌కు కేంద్రం 25% ఫండ్స్ ముందుగా రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత 21 రోజుల్లోపే రాష్ట్రం తన 25% వాటాను నోడల్​ ఏజెన్సీ అకౌంట్‌‌లో జమ చేయాలి. జమ అయిన మొత్తంలో 75% ఆ పథకానికి ఖర్చు చేస్తేనే కేంద్రం మిగతా నిధులను విడుదల చేస్తుంది. కేంద్రం​ఇచ్చిన ఫండ్స్‌‌ను పర్సనల్ డిపాజిట్, ఇతర అకౌంట్లకు దారి మళ్లించడానికి వీల్లేదు. ఏ పథకం అమలు కోసం ఇచ్చారో దానికే ఖర్చు చేయాలన్న ఆదేశాలు రాష్ట్రాలకు అందాయి. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలే, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రాలకు కేంద్ర పథకాల నిధులు ఎప్పటికప్పుడు విడుదలవుతున్నాయి. వేరే పార్టీల ప్రభుత్వాలుగా ఉన్నచోట అర్హులైన లబ్ధిదారులకు స్కీమ్స్​ అమలు కావడం లేదు. ఇకపై అలా లేకుండా కేంద్ర పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ సక్రమంగా అమలు కావడానికి కొత్త ప్రొసీజర్‌‌‌‌ రూల్స్‌‌ ఉపయోగపడుతాయి”అని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా,  కేంద్ర పథకాలను పక్కాగా అమలు చేస్తే సెంట్రల్‌‌లో అధికారంలో ఉన్న పార్టీకి పేరొస్తుందన్న రాజకీయ కోణంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సెంట్రల్‌‌ ఫండ్స్‌‌ను దారిమళ్లిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.