ఏవోసీ సెంటర్ ఆల్టర్ నేట్ రోడ్లకు జీహెచ్ఎంసీ టెండర్లు

ఏవోసీ సెంటర్ ఆల్టర్ నేట్ రోడ్లకు జీహెచ్ఎంసీ టెండర్లు
  • రూ.307 కోట్లతో 6 కిలోమీటర్ల వరకు నిర్మాణం
  • ఈ నెల 4 నుంచి  22 వరకు టెండర్ల స్వీకరణ
  • 12న ప్రి బిడ్ సమావేశం నిర్వహించనున్న బల్దియా
  • ఈ నెల 23న ఫైనల్ కానున్న ఏజెన్సీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏవోసీ(ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) సెంటర్ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. ఆర్మీ నుంచి వర్క్ పర్మిషన్ సైతం రావడంతో ఈ పనులు త్వరగా మొదలు పెట్టేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హెచ్ సిటీలో భాగంగా రూ.307.74  కోట్లతో రోడ్లను నిర్మించనుంది. ఈ నెల 4 నుంచి 22 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 12న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని చీఫ్ ఇంజినీర్  చాంబర్​లో ప్రి బిడ్ మీటింగ్ ను చీఫ్ ఇంజినీర్ నిర్వహించనున్నారు. 22న సాయంత్రం 4 గంటలకు బిడ్ లను ఓపెన్ చేసి, 23న ఫైనల్ చేయనున్నారు. ఆ తరువాత పనులు మొదలుకానున్నాయి. సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ కు వెళ్లకుండా ఆర్కేపురం చేరుకునేలా జీహెచ్ఎంసీ 6 కిలోమీటర్ల మేరా 100 అడుగుల రోడ్డును నిర్మించనుంది. 

42.20 ఎకరాల్లో 7 ఎకరాలు లీజు....

ఈ ఆల్టర్​ నేట్​ రోడ్ల కోసం మిలటరీకి చెందిన 42.20 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన భూ బదిలీపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులోని 7 ఎకరాలను ఆర్మీ వినియోగిస్తుంది. దీన్ని భూ బదిలీ కింది అప్పగించే అధికారం లేకపోవడంతో నామినల్ చార్జీలతో లీజు కింద జీహెచ్​ఎంసీకి అప్పగించేలా ఆర్మీతో ఒప్పందం జరిగింది. మిగతా 35.20 ఎకరాల భూమిని ఆర్మీకి జీహెచ్ంఎసీ బదిలీ చేయాల్సి ఉంది. 

కాగా, జవహర్ నగర్ లో షూటింగ్ ట్రైనింగ్ కోసం మిలటరీకి 400 ఎకరాలు ప్రభుత్వం అప్పగించగా, అక్కడ 600 ఎకరాల్లో ట్రైనింగ్ కొనసాగుతున్నట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీనిపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. ఈ భూమిలో 35.20 ఎకరాలను బదిలీ కింద అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మల్కాజిగిరి, నేరెడ్ మెట్, ఈసీఐఎల్ వెళ్లే వారికి ఈజీ..

మారేడ్ పల్లి నుంచి ఏవోసీ, మిలటరీ ఆస్పత్రి ప్రాంతాల్లో నుంచి వెళ్లే రోడ్లకు బదులుగా ప్రత్యమ్నాయంగా మారేడ్ పల్లి, సఫిల్ గూడ, ఆర్కేపురం మార్గాల ద్వారా రోడ్లను బల్దియా నిర్మించనుంది. ఆల్టర్నేట్​ రోడ్ల నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి, నేరెడ్ మెట్, ఈసీఐఎల్ వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిలటరీ ఏరియాలో నిర్మించే ఈ రోడ్డుకు కనెక్టింగ్ గా ఆర్కే పూర్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్ వోబీ), రైల్ అండర్ బ్రిడ్జి(ఆర్ యూబీ)లను జీహెచ్ఎంసీ నిర్మించనుంది. ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు సమాంతరంగా నిర్మించనున్నారు.