ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ ఓకే

ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ ఓకే

ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులు

అమరావతి, వెలుగు: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్  కేబినేట్ బుధవారం ఆమోదం తెలిపింది. జవనరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి జీత భత్యాలను చెల్లించాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనంలో భాగంగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటుకు అంగీకరించింది. ఆర్టీసీలో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్టుగా పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో పోస్టులు ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌‌ అంగీకారం తెలిపింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథాతథంగా కొనసాగించనున్నారు. ఈ మేరకు చట్ట సవరణలను కేబినేట్ ఆమోదించింది.

అక్రమంగా లిక్కర్ అమ్మితే ఐదేళ్ల జైలు

దశలవారీ మద్య నిషేధం అమలులో భాగంగా అక్రమంగా మద్యం తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా కఠిన శిక్షలకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులుగా పరిగణించే ఈ కేసుల్లో కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా ఏపీ ఎక్సైజ్ యాక్ట్ లో సవరణలు తీసుకురానున్నారు. మద్యం అక్రమ అమ్మకాల్లో మొదటి సారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానా, రెండో సారి పట్టుబడితే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్‌‌ ఫీజుకు 2 రెట్లు జరిమానా, రెండో సారి తప్పు చేస్తే లైసెన్స్‌‌ రద్దు చేస్తారు.