కేంద్రం వల్ల.. జల వివాదాలు సంక్లిష్టం... సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు

కేంద్రం వల్ల.. జల వివాదాలు సంక్లిష్టం... సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు
  • సెక్షన్ 3 ఫర్దర్ టర్మ్స్​తో రెండు రాష్ట్రాలకూ నష్టం
  • నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ పరిశీలిస్తుండగా కొత్త అంశాలెందుకు
  • కేటాయింపులపై దిగువ రాష్ట్రాలకు సంపూర్ణ హక్కులు
  • ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకకు సంబంధం లేదు
  • కేంద్రం తీరుతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణలోనూ ఇబ్బందులని వాదన 

హైదరాబాద్, వెలుగు: జల వివాదాల అంశంలో కేంద్రం తీరు వల్ల రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని, కేంద్రం జారీ చేసిన సెక్షన్ 3 ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సరికాదని సుప్రీంకోర్టుకు ఏపీ తెలియజేసింది. కేంద్రం తెచ్చిన టీవోఆర్​తో ఏపీకి నష్టం జరుగుతుందని, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం మరింత క్లిష్టంగా మారిందని పేర్కొంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేశ్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ2)కి అదనపు అంశాలు పరిశీలించే అధికారంలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఫర్దర్ టర్మ్స్ ను రద్దు చేయాలంటూ ఏపీ వేసిన రిట్ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది.

 ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను విభజన చట్టంలోని సెక్షన్‌‌ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని పార్లమెంట్ వేదికగా తొలుత నిర్ణయించారని, దీని ప్రకారం బ్రిజేష్‌‌ ట్రిబ్యునల్‌‌కు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిందని ఏపీ గుర్తు చేసింది. విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, ఇప్పటికే సెక్షన్ 89 ఏ, బీ అంశాల కింద బ్రిజేష్ ట్రిబ్యునల్ కు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలిస్తుండగా కొత్త అంశాలు చేర్చడం తగదని ఏపీ స్పష్టం చేసింది. విభజనచట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం ఫర్దర్​ టర్మ్స్ ను జారీ చేసిందని ఆక్షేపించింది. తెలంగాణ ఏర్పడ్డాక రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరిగాయని, రెండు రాష్ట్రాలూ పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయని వాదించింది.   

కింది రాష్ట్రాలకు సంపూర్ణ హక్కులు

కృష్ణా జలాలపై బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించిందని ఏపీ గుర్తు చేసింది. ఆ నీటిపై దిగువ రాష్ట్రాలకు సంపూర్ణ హక్కు ఉంటుందని, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలకు సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ గుర్తు చేసింది. ‘‘అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో ఒక ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ నీటిని తమ అవసరాలకు ఎలా వాడుకోవచ్చన్నది రాష్ట్రాల ఇష్టం. ఆ స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. ప్రాజెక్టులపై ఆంక్షలు పెట్టడం.. లేదా రాష్ట్రాల నీటి వాడకంపై కేంద్రం మితిమీరి జోక్యం చేసుకోవడం రాష్ట్రాల హక్కులను హరించడమే అవుతుంది’’ అని 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది. కేంద్రం తీరుతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుల నిర్వహణలోనూ ఇబ్బందులు వస్తున్నాయంది.

 2015లో రెండు రాష్ట్రాలు చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారమే నీటి పంపిణీ జరుగుతోందని ఏపీ కోర్టుకు తెలియజేసింది. ఏపీ వాదనలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. 2002లోపు జరిగిన ట్రిబ్యునల్ తీర్పులు, కేటాయింపులకు చట్టపరమైన రక్షణ ఉందని, వాటిపై ఇప్పుడు కొత్తగా పునఃసమీక్ష సాధ్యంకాదని స్పష్టం చేశారు. అయితే, విభజన చట్టం-2014లోని సెక్షన్ 89, సెక్షన్ 3 ఫర్దర్ టర్మ్స్ మధ్య తేడాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సమగ్రంగా వాదనలు వింటామని చెబుతూ కేసును వాయిదా వేశారు.