తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తేవాలి: ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తేవాలి: ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ ఆఫీసులో కాకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అప్పుడే మనపై ఉన్న అభిమానాన్ని  ఓటు రూపంలోకి కన్వర్ట్​ చేసుకోగలమన్నారు. శనివారం ఎన్టీఆర్‌‌‌‌ భవన్‌‌‌‌కు వచ్చిన చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.  

బాబు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ.. తెలంగాణలో పుట్టిన పార్టీ. 25 ఏండ్లుగా ఇక్కడ అధికారంలో లేదు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నమ్మకం కలిగించాలి.  పార్టీకి పూర్వవైభవం రావాలి’’ అని బాబు సూచించారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్లే  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

 ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రామచంద్రరాజు కమిషన్‌‌‌‌ వేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. 2004 తర్వాత ఆనాటి ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడంతో వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మనం చేసిన వర్గీకరణ సబబు అని, అది సోషల్‌‌‌‌ జస్టిస్‌‌‌‌కు నాంది పలుకుతుందని ఏడుగురితో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ 6:1 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఆ రోజు మనం చేసింది ఈ రోజు రిలవెంట్‌‌‌‌ అయ్యింది. టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీ. దీనిని మళ్లీ శక్తివంతంగా చేసుకోవాలి’ అని చంద్రబాబు సూచించారు.