హైదరాబాద్, వెలుగు: ఎన్టీఆర్ విజన్తో పాటు పేద లకు వైద్య చికిత్స అందించాలన్న సంకల్పంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వంద పడకలతో స్టార్ట్ అయిన హాస్పిటల్ 25 ఏళ్లలో భారీగా విస్తరించిందన్నారు. సోమవారం హెచ్ఐసీసీలో జరిగిన బసవతారకం 25 ఏండ్ల రజతోత్సవ వేడుకలకు చంద్రబాబు అటెండ్ అయి మాట్లాడారు. “ మా అత్త బసవతారకం స్ఫూర్తితో ఇది నిర్మితమైంది.
ఆమెకు సోకిన క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఆ సమయంలో ఎక్కడా ఆస్పత్రి లేని పరిస్థితి. ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లోనే క్యాన్సర్ ఆస్పత్రులు ఉండేవి. ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందక ఇక ఎవరూ చనిపోకూడదనే ఆలోచనతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. మొక్కగా నాటిన ఈ ఆస్పత్రి ఇప్పుడు మహా వృక్షంగా ఎదిగింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో త్యాగాలు ఉన్నాయి. అన్ స్టాపబుల్ గా బాలకృష్ణ ఈ ఆస్పత్రి కోసం పనిచేస్తున్నారు” అని అన్నారు.
