- సామరస్యంగా ముందుకెళ్తేనే తెలుగు రాష్ట్రాలకు మేలు: ఏపీ సీఎం చంద్రబాబు
- నీళ్ల కోసం తెలుగువాళ్ల మధ్య విద్వేషాలు ఎందుకు?
- పోలవరంతో గోదావరి నుంచి ఎన్ని నీళ్లయినా తీస్కపోవచ్చు
- దీని నుంచి నల్లమలసాగర్‌కు తరలిస్తం
- నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రమేదీ ఉండదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనమేమీ లేదని, సామరస్యంగా ముందుకెళ్తేనే రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీళ్ల కోసం తెలుగు జాతి మధ్య విద్వేషాలు ఎందుకని ప్రశ్నించారు. ‘‘నీళ్లు కావాలా? గొడవలు కావాలా? అంటే.. గొడవలే కావాలని ప్రతిపక్ష నేత జగన్ అంటున్నారు. కానీ నాకు కావాల్సింది గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం. నన్ను ఎన్నుకున్న ఏపీ ప్రజల ప్రయోజనాల విషయంలోనూ రాజీపడను” అని తెలిపారు.
శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘మనం కడుతున్నది కేవలం పోలవరం ప్రాజెక్ట్మాత్రమే కాదు.. దీని ద్వారా ఇటు విశాఖపట్నానికి, అటు కృష్ణాకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లను గోదావరి నుంచి తీస్కపోవచ్చు. వరద జలాలను వాడుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. విశాఖపట్నం నుంచి వంశధారకు, కృష్ణా నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లను తీసుకెళ్లేందుకు వీలవుతుంది. గోదావరి నదిపై ఓ ట్రంక్ కెనాల్‌ను నిర్మించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నీళ్లు పారుతుంటే.. డిస్ట్రిబ్యూటరీలు, చిన్న కాలువలను నిర్మించుకుని పంటలకు నీళ్లిచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్పూర్తయిన తర్వాత నదుల అనుసంధానం చేసుకుంటే.. ఏపీని మించిన రాష్ట్రం ఇంకేది ఉండదు” అని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లే నీళ్లను అవసరమైతే తెలంగాణ కూడా వాడుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఆ మండలాల విలీనంతోనే పోలవరం..
రాళ్ల సీమను రతనాల సీమగా మార్చామని చంద్రబాబు అన్నారు. ‘‘ఆనాడు పట్టిసీమ కట్టి గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించాం. అక్కడి నుంచి శ్రీశైలానికి తీసుకెళ్లి, ఆదా చేసిన నీళ్లను రాయలసీమకు తరలించి.. ఆ రాళ్ల సీమను రతనాల సీమగా మార్చాం. వంద టీఎంసీలను కృష్ణా డెల్టాకు ఇచ్చాం. ఆదా చేసిన కృష్ణా నీళ్లను శ్రీశైలం నుంచి రాయలసీమకు హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా ఇచ్చాం” అని తెలిపారు. కాగా, ఆనాడు తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ముందుకుపోయేది కాదని చంద్రబాబు అన్నారు. ఆ ఏడు మండలాలను ఏపీలో కలపకుంటే సీఎంగా ప్రమాణం చేయబోనని చెప్పానని, ఆ తర్వాతే ఆ మండలాలను ఏపీలో కేంద్రం కలిపిందని పేర్కొన్నారు. అవి ఏపీలో కలవడంతోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైందన్నారు.
