
కడప: డిసెంబర్ 26న జమ్మలమడుగు లో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు కడపలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ .. కడప లో ఉక్కు పరిశ్రమ కోసం ఈ ఏడాది చివర్లో శంకుస్థాపన చేస్తామని, మూడేళ్ళ లో ఈ పరిశ్రమ పూర్తి చేసి 20 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. త్వరలో చెన్నూరు చక్కెర పరిశ్రమ తెరిపిస్తామని, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా చెక్కర పరిశ్రమ తెరిచి చెరుకు రైతులను ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
అదే విధంగా ఈ ఏడాదిలో గండికోట ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గండికోట ముంపు గ్రామాల రైతులకు గతంలో ఇచ్చిన 6.5 లక్షలకు మరో 3.5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకుంటామన్నారు సీఎం.