చంద్రబాబు అబద్ధాలకోరు: సీఎం జగన్

చంద్రబాబు అబద్ధాలకోరు: సీఎం జగన్

మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అవలీలగా అబద్ధాలు చెబుతారని, ఆ విషయాన్ని ఆయనే అసెంబ్లీలో ఒప్పుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టుపై చంద్రబాబు  తప్పుడు పేపర్లు చూపి మాట్లాడారని, మరుసటి రోజు ఒరిజినల్​ పేపర్లు చూపించి వైఎస్ ఆయనను నిలదీశారని, అబద్ధమాడినట్లు చంద్రబాబు సభలో ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తాను అబద్ధమాడితేనే నిజాలు బయటికొస్తాయని కవర్​ చేసుకునే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు మాదిరి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పొద్దని, నిజాలే మాట్లాడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. బుధవారం ఏపీ అసెంబ్లీ హాల్ లో ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యేలు సభా నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. సభలో చట్టాలు చేసినవాళ్లే వాటిని ఉల్లంఘించే పరిస్థితులు రాకూడదన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యేవాడినని గుర్తు చేసుకున్నారు. ఏయే సబ్జెక్టులపై ఎవరు మాట్లాడతారో పార్టీ విప్​లకు ముందుగానే పేర్లు ఇవ్వాలని, ప్రజాధనంతో నడిచే సభా సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. అవేశపడి మాట్లాడే కన్నా లాజిక్​గా ప్రతిపక్షం ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. సభ నడుస్తున్న తీరును ప్రజలు చూస్తుంటారన్న విషయాన్ని మరచిపోరాదన్నారు. ఎమ్మెల్యేలందరికీ సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని, సభను హుందాగా నడిపిస్తామన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మైకులు కట్​ చేసే కల్చర్ ​తమ సర్కారులో ఉండదన్నారు.

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు…

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల కోసమే పోరాడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీ ప్రభుత్వానికి రాసిన మొదటి లెటర్ లో ప్రజావేదికను తనకే కేటాయించాలని కోరినట్లు గుర్తు చేశారు.  ప్రజావేదిక కూల్చేసిన తర్వాత తనకు సెక్యూరిటీ పెంచాలని హైకోర్టులో పిటిషన్​ వేసి పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ సొంత పనులు, సౌకర్యాల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారంటూ విమర్శించారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో విత్తనాల సేకరణకు కేటాయించాల్సిన రూ. 380 కోట్లను ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మళ్లించినట్లు ఆరోపించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి రూ. 30 వేల కోట్ల ప్రభుత్వ నిధులు మాయం చేశారన్నారు. అన్ని తప్పులు చేసి నిజాయతీ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ధైర్యానికి జోహార్లంటూ బుధవారం ట్వీట్ చేశారు.