150 టీఎంసీల కెపాసిటీతో ఏపీలో భారీ రిజర్వాయర్

150 టీఎంసీల కెపాసిటీతో  ఏపీలో భారీ రిజర్వాయర్

    గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మాణం

    డీపీఆర్‌‌‌‌ తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశం

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు 150 టీఎంసీల కెపాసిటీతో భారీ రిజర్వాయర్ నిర్మాణానికి ఏపీ సర్కారు దృష్టి పెట్టింది.పోలవరం వద్ద ఉన్న గోదావరి జలాలను బనకచర్ల హెడ్‌‌‌‌రెగ్యులేటర్‌‌‌‌కు తరలించేందుకు డీపీఆర్ రెడీ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.60 వేల కోట్లకుపైనే అవుతుందని అంచనా వేసింది.  గోదావరి ద్వారా సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిలో రోజుకు 2 టీఎంసీల నీటిని, మొత్తంగా 210 టీఎంసీలను తరలించాలన్నది ఆలోచన. దీని ద్వారా నాగార్జున సాగర్‌‌‌‌ కుడికాల్వ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జున సాగర్‌‌‌‌ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తోంది.

గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలన్నది ఆలోచన. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటు పులిచింతల అటు నాగార్జున సాగర్ మీద ఆధారపడ్డ ప్రాంతాలకు బొల్లాపల్లి బాలెన్సింగ్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌లోని నీరు ప్రాణాధారంలా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.  గత 15 ఏళ్ల గోదావరి నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని 105 రోజుల్లో  రోజుకు 3.7 టీఎంసీల ప్రవాహం ఉంటుందని అంచనా వేశారు. గోదావరి డెల్టా అవసరాలుపోను మిగిలిన నీరు సముద్రంలోకి పోతోంది. ఈ జలాలను కరువు, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ మేలు చేకూరుతుందని సర్కారు భావిస్తోంది.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెలిగొండతోపాటు కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టు, ఎస్సార్‌‌‌‌బీసీ తదితర అవసరాల కోసం బనకచర్ల రెగ్యులేటర్‌‌‌‌ ద్వారా నీరందించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

నీటి తరలింపు ఇలా..

పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి, అక్కడ నుంచి నాగార్జునసాగర్‌‌‌‌ కుడికాల్వకు ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి బొల్లాపల్లిలో ప్రతిపాదిత బ్యాలెన్సింగ్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు నీటిని లిఫ్ట్‌‌‌‌ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ రిజర్వాయర్‌‌‌‌కు నీటిని అందిస్తూ, మరోవైపున  నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌‌‌‌ను తవ్వడం ద్వారా బనకచర్ల హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌కు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీ ద్వారా మరికొన్నిచోట్ల లిఫ్ట్ చేస్తారు. దీని కోసం 2100 మెగావాట్ల కరెంటు అవసరమని లెక్కలు వేశారు.