మంగళవారం ( నవంబర్ 11 ) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు పోలింగ్ సందర్భంగా షూటింగ్స్ రద్దు చేసిన ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికులకు సెలవు ప్రకటించింది. అత్యవసరం అయితే మధ్యాహ్నం 2 గంటల తరువాత షూటింగ్ ప్లాన్ చేసుకోవాలని తెలిపింది ఫిలిం ఫెడరేషన్. అయితే.. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల ఓట్లు ఖైరతాబాద్ పరిధిలోకి రాగా.. కార్మికుల ఓట్లు ఎక్కువగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉండటంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి షేక్ పేట్ లోని నారాయణమ్మ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. షేక్ పేట్ లోని మరో పోలింగ్ సెంటర్ లో కమెడియన్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధుర నగర్ లో సుమ కనకాల, రాజీవ్ కనకాల సహా పలువురు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మంగళవారం జరగనున్న ఈ ఎన్నిక కోసం సుమారు నెలరోజులుగా ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఆదివారం ( నవంబర్ 9 ) సాయంత్రంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటంతో నియోజకవర్గ పరిధిలో మైకులన్నీ మూగబోయాయి.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్.
జూబ్లీ హిల్స్ వెంకటగిరి కాలనీలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లు ఉపయోగించనున్నారు అధికారులు. ఎన్నికల నిర్వహణలో డ్రోన్లు వాడటం ఇదే మొదటిసారి.139 పోలింగ్ లొకేషన్స్ లో 139 డ్రోన్లను వినియోగించనున్నారు అధికారులు.డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయనున్నారు.విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో డ్రోన్లను పరిశీలించారు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
