తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ, వైవిధ్యమైన పాత్రల ఎంపికతో దూసుకుపోతున్న యువ నటుడు తిరువీర్. కేవలం సహాయ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయకుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు. రంగస్థలం నుంచి వెండితెరపై తన నటనతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. నటనపై తనకున్న అపారమైన మమకారాన్ని, నైపుణ్యాన్ని ప్రతి పాత్రలోనూ చూపిస్తున్నారు.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో కామెడీ కింగ్ గా..
లేటెస్ట్ గా నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో తిరువీర్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. హారర్, డ్రామానే కాదు కామెడీని కూడా అద్భుతంగా పండించగలనని ఈ చిత్రంతో తిరువీర్ నిరూపించారు. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా పండింది. ముఖ్యంగా, ఒక కీలక సన్నివేశంలో నాలుగు వేరియేషన్స్ చూపిస్తూ తిరువీర్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి విమర్శకులు సైతం ప్రశంసించారు. 'మసూద'తో భయపెట్టిన హీరో, ఇప్పుడు 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో ప్రేక్షకులను పగలబడి నవ్వించారు.
'బొమ్మల రామారం' సినీ ప్రయాణం
2016లో 'బొమ్మల రామారం' సినిమాతో మొదలైనప్పటికీ నుంచి నటుడిగా తిరువీర్ గుర్తింపు తెచ్చిపెట్టింది 2019లో వచ్చిన 'జార్జ్ రెడ్డి' (లలన్ సింగ్ పాత్ర), 2020లో వచ్చిన 'పలాస 1978' (రంగారావు పాత్ర) చిత్రాలు. ఈ పాత్రల్లో ఆయన చూపించిన తీవ్రత, సహజత్వం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి, ముఖ్యంగా 'జార్జ్ రెడ్డి'లో ప్రతికూల పాత్రకుగాను ఆయనకు అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత 'సిన్' వెబ్ సిరీస్, నాని 'టక్ జగదీష్' వంటి ప్రాజెక్టుల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.
'మసూద'తో హీరోగా టర్నింగ్ పాయింట్
2022లో వచ్చిన హారర్ థ్రిల్లర్ 'మసూద'తో తిరువీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో, తెలుగు ఇండస్ట్రీలో తిరువీర్ పేరు మారుమోగిపోయింది. 2023లో వచ్చిన తెలంగాణ యాస కామెడీ చిత్రం 'పరేషాన్'లో హీరోగా తనదైన మార్కు నటనతో మంచి మార్కులు కొట్టేయడమే కాక, 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించారు.
►ALSO READ | SSMB29: కీరవాణి మ్యూజికల్ మాజిక్: శ్రుతి హాసన్ గళంలో 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ విడుదల!
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ విజయంతో తిరువీర్ ఇప్పుడు టాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఈ చిత్రంలో తిరువీర్ తో పాటు టీనా శ్రావ్య టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా కీలకపాత్రలో నటించారు. 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఆయన భార్య కల్పనా రావు వ్యవహరించడం విశేషం. సంగీతాన్ని సురేష్ బొబ్బిలి అందించారు. తాజాగా, తిరువీర్ తన కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నట్లు సమాచారం. అలాగే, 'భగవంతుడు' అనే మరో ప్రాజెక్ట్ కూడా సెట్స్‌పై ఉంది. భవిష్యత్తులో ఆయన తప్పకుండా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని, తెలుగు సినిమాకు ఒక గొప్ప నటుడు దొరికాడని అభిమానులు తమ అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు.
