సోమవారం ( నవంబర్ 10 ) ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసి ఉన్న ఐ20 కారులో పేలుడు సంభవించడంతో 13 మృతి చెందగా.. 24 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది ప్రబుత్వం. పోలీసులు, NIA దర్యాప్తు ప్రారంభించాయి. అయితే.. ఘటనాస్థలి దగ్గర బుల్లెట్ లభించడం కీలకంగా మారింది. బ్లాస్ట్ జరిగిన స్పాట్ లో బుల్లెట్ ఎలా వచ్చింది.. పేలుడు ఘటనకు బుల్లెట్ సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా కదులుతున్న కారులో పేలుడు సంభవించిందని తెలిపారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా. పేలుడు సంభవించిన సమయంలో కారులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న NIA, NSG బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. బ్లాస్ట్ జరిగిన ప్రాంతం నిత్యం వేలాది మంది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో పేలుడు వెనక ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
►ALSO READ | ఢిల్లీ పేలుడు ఘటనతో.. హైదరాబాద్లో హై అలర్ట్.. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్లో తనిఖీలు
ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. CNG సిలిండర్ పేలి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కుట్ర కోణం దాగి ఉందేమోననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఘటనతో ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్ లో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
