తెలంగాణను ఆపండి..అక్రమంగా కరెంటు ఉత్పత్తి చేస్తోంది

తెలంగాణను ఆపండి..అక్రమంగా కరెంటు ఉత్పత్తి చేస్తోంది


హైదరాబాద్, వెలుగు:తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ కృష్ణా నదిపై ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ సీఎం జగన్ ఆక్షేపించారు. ఈమేరకు గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తూ దిగువ రాష్ట్రమైన తమకు ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తోందని తెలిపారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కృష్ణా పై రెండు రాష్ట్రాలకు కామన్ రిజర్వాయర్ లుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్స్ ను కేఆర్ఎంబీ నిర్వర్తిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కుడి వైపున ఏపీ ఉండగా, ఎడమ వైపున తెలంగాణ భూభాగం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయని వివరించారు. తెలంగాణ భూభాగంలోని జూరాలతో పాటు తమ భూభాగంలోని పులిచింతల ప్రాజెక్టుపైనా తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఎగువ రాష్ట్రామైన తెలంగాణ తనకు ఉన్న భౌగోళిక అనుకూలతను ఆసరాగా చేసుకొని వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే శ్రీశైలం నుంచి కరెంట్ ఉత్పత్తి ప్రారంభించిందని వివరించారు. వాస్తవానికి శ్రీశైలం రిజర్వాయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అయినా, ఉమ్మడి ఏపీ రాష్ట్ర తాగు, సాగు, ఇండస్ట్రియల్ అవసరాల మేరకు దాన్ని మల్టీ పర్పస్ ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, కనీస నీటి మట్టం 834 అడుగులుగా ఉందని, దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు 854 అడుగుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తూ నీటిని నదిలోకి వదిలేయవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 808.40 అడుగుల నీటిమట్టం ఉన్న సమయంలోనే జూన్ ఒకటో తేదీన కరెంట్ ఉత్పత్తి ప్రారంభించిందని తెలిపారు. అప్పటికే నాగార్జునసాగర్ లో వానాకాలం పంట సీజన్ అవసరాల కోసం 173.86 టీఎంసీల నీళ్లున్నా శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి కొనసాగించారని తెలిపారు. జూన్ నెలాఖరు వరకు శ్రీశైలంలోకి ఎగువ నుంచి 17.36 టీఎంసీల నీళ్లు రాగా, అందులో 6.9 టీఎంసీలు తెలంగాణ కరెంట్ ఉత్పత్తి ద్వారా సాగర్ కు విడుదల చేసిందని పేర్కొన్నారు. 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తాము నీటిని తీసుకోగలమని వివరించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, చెన్నైకి తాగునీళ్లు అందకుండా అడ్డుపడుతోందని తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ లో కరెంట్ ఉత్పత్తి నిలిపి వేయించాలని తమ ప్రభుత్వం జూన్ 10, 17, 23, 29 తేదీల్లో కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిందని వివరించారు. కరెంట్ ఉత్పత్తి నిలిపి వేయాలని కేఆర్ఎంబీ తెలంగాణ జెన్కో కు లేఖ రాసిందని గుర్తు చేశారు.

సంబంధాలు దెబ్బతినే ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ కు విరుద్ధంగా కరెంట్ ఉత్పత్తి చేస్తోందని జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ అనుసరిస్తున్న తీరుతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రమైన ఏపీ సాగు, తాగునీటితో పాటు చెన్నై నగర తాగునీటి అవసరాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ అక్రమ కరెంట్ ఉత్పత్తిని ఆపేలా ఆదేశించాలని కోరారు. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా తెలంగాణ డ్రా చేస్తున్న నీటిని ఆ రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల లెక్కలో వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవాలని, కృష్ణా బోర్డు జ్యూరిస్ డిక్షన్ ను నోటిఫై చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల కామన్ రిజర్వాయర్ల నుంచి రెండు రాష్ట్రాలు నీటిని తీసుకునే పాయింట్ల దగ్గర సీఐ ఎస్ఎఫ్ బలగాలను నియమించాని కోరారు.