ప్రజలు కోరుకున్నదానిపై ముందుకెళ్తాం

ప్రజలు కోరుకున్నదానిపై ముందుకెళ్తాం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దు చేస్తూ కొత్తగా పెట్టిన బిల్లులపై అసెంబ్లీ జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడూతూ మూడు రాజధానుల నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించారు. అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. వీటి అభివృద్దికి మరో పది , ఇరవై ఏండ్లు పడితే ఆ ఖర్చు ఆరేడు లక్షల కోట్లకు పోతుందని, ఆ స్థాయిలో ఖర్చు బెట్టే పరిస్థితి లేదని, ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అన్నారు.  శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో, వెనుకబడిన  ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రకరణకు కట్టుబడ్డామన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఆ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి కొంతమంది రకరకాలుగా వక్రీకరణలు చేస్తూ, అపోహలు క్రియేట్ చేస్తూ వస్తున్నారని, న్యాయ పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందరూ సహకరించి ఉంటే ఈ పాటికే మంచి ఫలితాలు వచ్చేవి కానీ, అలా జరగకపోవడం వల్లే  ఈ రోజు వికేంద్రీకరణ బిల్లు రద్దుపై నిర్ణయం తీసుకుంటూ తాను ప్రకటన చేయాల్సి వస్తోందని జగన్ చెప్పారు.

ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోదించారు


గతంలో చేసినట్లుగా కేంద్రీకరణ ధోరణలు ఉండొద్దని ప్రజలు గట్టిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా  ప్రస్ఫుటంగా చెప్పారని, మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆ విషయాన్ని తమ ప్రభుత్వ వచ్చిన తర్వాత జరగిన ప్రతి ఎన్నికల్లోనూ మళ్లీ మళ్లీ ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు. అందుకే వికేంద్రీకరణే సరైనదని బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని చెప్పారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, గడచిన ఈ రెండున్నరేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు తమ ప్రభుత్వానికే అండగా నిలిచారన్నారు. 

సమస్యలు లేకుండా సమగ్రంగా బిల్లు తెస్తాం

వికేంద్రీకరణకు సంబంధించి కొందరు అనేక  అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు సృష్టించారని, అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను ముందుకు తెచ్చారని జగన్ అన్నారు. ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ సమస్యలు లేకుండా సమగ్రమైన మార్పులు, చేర్పులతో కొత్త బిల్లులను త్వరలోనే తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ప్రస్తుతానికి గతంలో తెచ్చిన బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు.