వైఎస్ షర్మిల చేరికపై ఖర్గేదే తుది నిర్ణయం

వైఎస్ షర్మిల చేరికపై ఖర్గేదే తుది నిర్ణయం
  • ఇన్​చార్జ్ మాణిక్కం ఠాకూర్
  • ఏపీ నేతలతో   కాంగ్రెస్​చీఫ్​ఖర్గే భేటీ
  • లోక్ సభ ఎన్నికలు, షర్మిల చేరికపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు:వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరే అంశంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేదే తుది నిర్ణయం అని ఏపీ కాంగ్రెస్ ఇన్​చార్జ్ మాణిక్కం ఠాకూర్ అన్నారు. అయితే పొత్తుల విషయంపై రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయం ఉంటుందన్నారు. ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో బుధవారం ఏపీ కాంగ్రెస్ నేతలతో ఖర్గే సమావేశం అయ్యారు. ఈ భేటీలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, పార్టీ ఏపీ ఇన్​చార్జ్ మాణిక్కం ఠాకూర్, ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు, సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, పల్లంరాజు, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మ, తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో... ఏపీలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, షర్మిల చేరిక, వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీతో పొత్తు, ఇతర అంశాలపై మంతనాలు జరిపారు. భేటీ తర్వాత మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అనుకూల నేతలను.. ఖర్గే, సోనియా నాయకత్వాన్ని, కాంగ్రెస్ ఐడియాలజీని విశ్వసించే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ప్రధాని మోదీ వివక్ష కారణంగా గత పదేండ్లలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాబోయే 100 రోజుల్లో ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పని చేయాలనే అంశంపై ఖర్గే దిశానిర్దేశం చేశారని ఏపీ పీసీసీ రుద్రరాజు తెలిపారు. 

షర్మిల రాకపై నేతల అభిప్రాయం...

ఈ కీలక భేటీలో భాగంగా షర్మిల పార్టీలో చేరికపై అధిష్టానం నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ సందర్బంగా నేతలందరూ షర్మిల రాకను స్వాగతించినట్లు సమాచారం. ఆమెను కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దింపాలని మరికొందరు అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతోనూ ఇదే 
విషయాన్ని ఏపీ నేతలు వ్యక్తం పరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. షర్మిల కూడా ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె భర్త బ్రదర్ అనిల్ హస్తిన చేరుకోగా.. షర్మిల నేడు ఢిల్లీ రానున్నట్లు సమాచారం.