- రంగనాథ్‌తో భేటీలో పవన్ కళ్యాణ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా చేస్తున్న పనులను ఆయన ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైడ్రా కార్యకలాపాల తీరును రంగనాథ్ ను పవన్ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలోనూ, ఆక్రమణలను తొలగించడంలోనూ హైడ్రా చేస్తున్న విధానం చాలా బాగుందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా, అక్రమ నిర్మాణాలను తొలగించే విషయంలో హైడ్రా తీసుకుంటున్న కఠిన చర్యల గురించి రంగనాథ్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కూడా అలాంటి సంస్థ అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
