ఎందుకు ఓడిపోయారో మంగళగిరి ప్రజలని అడగండి: డిప్యూటి సీఎం

ఎందుకు ఓడిపోయారో మంగళగిరి ప్రజలని అడగండి: డిప్యూటి సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. తమ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని,  గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి చేస్తున్నామని ఆమె తెలిపారు.

లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలంటూ చంద్రబాబు యువతను మోసం చేశారని ఆమె అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 600 హామీలిచ్చి అవమానించారని, గిరిజనులకు తెలివి లేదని బాబు అవమానించారని ఆమె గుర్తు చేశారు. ఆశా వర్కర్లపై తప్పుడు ట్వీట్లు చేసి అభాసు పాలైన చంద్రబాబు..  తన ట్వీట్ తానే తొలగించుకున్నారంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలుస్తుందని అన్నారు.

40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుని తిరిగే చంద్రబాబు కంటే 40 ఏళ్ల వయస్సున్న సీఎం జగన్ 40 రోజుల్లో చేసి చూపించారని పుష్ప శ్రీవాణి అన్నారు. సీఎం జగన్ 2 నెలల్లోనే లక్షా 30 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఆమె తెలిపారు. 40 ఏళ్లలో చంద్రబాబు ఇంత పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశారా?  దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశారా? ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయారో ఇంకా అర్థం కావడం లేదన్న డిప్యూటి సీఎం.. ఆ విషయం  లోకేష్ ను ఓడించిన మంగళగిరి ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు.  ఓటమితో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని,  ఇప్పటికైనా బుద్ధి మారకుంటే 23 సీట్లు కాస్త 3 సీట్లు అవుతాయని ఆమె అన్నారు.