షర్మిలకు రాజకీయ క్షేత్రం ఏపీనే : వినోద్ కుమార్

షర్మిలకు రాజకీయ క్షేత్రం ఏపీనే : వినోద్ కుమార్

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన౦లో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. రసమయి ఉద్యమంలో ఉన్నపుడు షర్మిల స్కూలుకో, కాలేజ్ కో వెళ్తుండొచ్చని వినోద్ కుమార్ అన్నారు. షర్మిలకు రాజకీయ క్షేత్రం తెలంగాణ కాదని, ఆమె క్షేత్రం ఆంధ్రప్రదేశే అని చెప్పారు. షర్మిలను ఇక్కడ తిప్పేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనన్న ఆయన... తెలంగాణ ప్రజలని గందరగోళం పరిచేందుకు ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. తెలంగాణ  ప్రాజెక్ట్ లకి జాతీయ హోదా కావాలని ఎప్పుడైనా ఆడిగావా షర్మిలా? అని ప్రశ్నించారు. షర్మిల నీవు క్రైస్తవ మతం స్వీకరించావా..?  నీ భర్త అనిల్ క్రైస్తవం గురించి మాట్లాడుతారు కదా అని నిలదీశారు. బైంసాలో ముస్లింలు, హిందువుల పంచాయతీ గత 40 ఏళ్లు గా జరుగుతోందన్నారు.

బండి సంజయ్ అక్కడ నిప్పు రాజేసి దాన్ని రాష్ట్రమంతా రాజేయాలని చూస్తున్నాడని వినోద్ కుమార్ ఆరోపించారు. పాదయాత్రలో ముందు షర్మిల ..వెనుక సంజయ్ తిరుగుతున్నాడన్నారు. తెలంగాణ కోసం ఎప్పుడైనా మాట్లాడావా సంజయ్..? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉందని, రసమయిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి మనం పాటుపడాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 24 గంటల కరెంట్ ఇస్తున్నరా? ఆ రాష్ట్రాల్లో పర్యటన చేద్దామా సంజయ్ ? అని సవాల్ విసిరారు. ఎన్నికలప్పుడు మీరు చేసే ఖర్చు శవ యాత్రలో పెట్టినట్లేనని చెప్పారు. శవానికి ఎంత ముస్తాబు చేసినా వృధానే అన్న వినోద్ కుమార్... తెలంగాణలో నిర్మించిన ప్రొజెక్టుల్ని ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాలు ఉన్నోళ్లు రైతు బంధు తీసుకోవట్లేదని, వారు బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లేదని తెలిపారు. భూమి లేని వాళ్ళ కోసం రైతు భీమా ఇవ్వాలని సీఎంతో చర్చిస్తున్నామన్నారు. ఈ విషయం ఈటల రాజేందర్ కు కూడా తెలుసని చెప్పారు.