- బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ముట్టుకోవద్దట
హైదరాబాద్, వెలుగు: బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2) ముందు ఏపీ వితండవాదం చేసింది. 1970ల్లో బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1) చేసిన కేటాయింపులనే కొనసాగించాలని అడ్డంగా వాదించింది.
బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 కేటాయించిందని, ఆ కేటాయింపులను ముట్టుకోవద్దని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనలు బుధవారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం 2 రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులనే కొనసాగించారని ఏపీ పేర్కొన్నది. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపుల ఆధారంగా బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా కేటాయింపులను అలాగే ఉంచేసి.. అదనంగా 65 శాతం, సగటు కేటాయింపులుగా 1,005 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి ఇచ్చిందని గుర్తు చేసింది.
కాబట్టి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో వాటాను ముట్టుకోరాదని స్పష్టం చేసింది. పైగా సెక్షన్ 89ను కాదని.. సెక్షన్ 3 కింద కేంద్రం ఇచ్చిన ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చెల్లదని, దీనిపై ట్రిబ్యునల్‌కు రివ్యూ చేసే అధికారమూ లేదని ఏపీ వితండవాదం చేసింది. మరోవైపు సెక్షన్ 46 కింద ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించారని, అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు నీటి కేటాయింపులను ఇవ్వాలని డిమాండ్ చేసింది.
