హైదరాబాద్ సిటీలో పెరగనున్న అపార్ట్ మెంట్ల ధరలు

హైదరాబాద్ సిటీలో పెరగనున్న అపార్ట్ మెంట్ల ధరలు

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా సవరించిన కొత్త మార్కెట్ విలువలను ఈ నెల 5 నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నది. ప్రాంతాలవారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి.. ఈ కొత్త విలువలను ఖరారు చేసింది. కొత్త ధరల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ. 2.75 లక్షలుగా నిర్ణయించారు. అదే సమయంలో క్యూర్ ఏరియా పరిధిలోకి వచ్చే వ్యవసాయ భూముల ఎకరా కనీస ధర రూ. 15 లక్షలుగా ఖరారు చేశారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత గరిష్ట మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో గతంలో ఎకరాకు రూ. 24 కోట్లు ఉండగా, ఇప్పుడు దానిని రూ. 30 కోట్లకు పెంచారు.  

అపార్ట్‌‌మెంట్ల ధరల పెంపు శాతం ఇలా.. 

కొత్త మార్కెట్​ సవరణల  ప్రకారం వ్యవసాయ భూములకు 50 శాతం మేర ఎక్కువ పెంచుతుండగా, గరిష్టంగా 100 శాతం మేర పెంపు ఉండనుంది. ఓపెన్​ ప్లాట్లకు 50 శాతం నుంచి 100 శాతం వరకు, అలాగే అపార్ట్​మెంట్లకు గరిష్టంగా 20 శాతం మేర ధరలు పెరగనున్నాయి. ఫ్లాట్ల విషయంలో గతంలో ఉన్న అంతస్తుల వారీ అసమానతలను తొలగించి, అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ హేతుబద్ధీకరించారు. ఇప్పటికే విపరీతమైన మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపును ప్రతిపాదించలేదు.

  ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ విలువకు, బహిరంగ మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని (గ్యాప్) బట్టి ఈ పెంపు అమలుచేశారు. ప్రస్తుతం ఉన్న విలువకు, వాస్తవ ధరకు మధ్య 0% నుంచి 20% వరకు గ్యాప్ ఉంటే ఎలాంటి పెంపు లేదు. అలాగే 20% పైబడి 50% వరకు గ్యాప్ ఉంటే 15 శాతం, 50% పైబడి 100% వరకు గ్యాప్ ఉంటే 25 శాతం, 100% పైబడి 200% వరకు గ్యాప్ ఉంటే 50 శాతం మేర మార్కెట్ విలువను పెంచనున్నారు.

 ఇక 200% పైబడి 500% వరకు గ్యాప్ ఉన్న చోట 75 శాతం, 500% కంటే ఎక్కువ గ్యాప్ ఉన్న ప్రాంతాల్లో గరిష్టంగా 100 శాతం మేర మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణ రంగంలో (కన్‌‌స్ట్రక్షన్ వాల్యూ) ఇండ్లు, అపార్టెమెంట్ ఫ్లాట్ల  విలువల్లో 2021 తర్వాత ఎలాంటి సవరణలు జరగలేదు. గత ఐదేండ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్​సీసీ, నాన్-ఆర్​సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించారు. అనేక  గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అప్‌‌గ్రేడ్ కావడం వల్ల ఈ మార్పులు  చేశారు.