ఏపీ రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్: రూ.138 కోట్లు జమ చేసిన APCRDA

ఏపీ రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్: రూ.138 కోట్లు జమ చేసిన APCRDA

ఏపీ రాజధాని  అమరావతి  నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 1.0 కింద భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ స్కీమ్ కింద మొత్తం 27,811 మంది రైతులు కౌలుకు అర్హులవ్వగా ఇందుకు  214 కోట్ల 46 లక్షల రూపాయల నిధులు అవసరమవుతాయని APCRDA వెల్లడించింది.

ఇప్పటికే 23,932 మంది రైతులకు సంబంధించి 145 కోట్ల రూపాయల చెల్లింపులు ఖరారవ్వగా.. అందులో 17,718 మంది రైతుల ఖాతాల్లో 138 కోట్ల 46 లక్షల రూపాయలను అధికారులు విజయవంతంగా జమ చేశారు.అయితే సాంకేతిక కారణాల వల్ల కొన్ని చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. NPCI లింకేజీ సమస్యలు, ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉండటం, బ్యాంక్ ఖాతాలు ఇనాక్టివ్‌గా మారడం ,  మరణించిన రైతుల వారసుల పత్రాల వెరిఫికేషన్ వంటి కారణాల వల్ల దాదాపు 3,879 మంది రైతులకు సంబంధించిన 68 కోట్ల 53 లక్షల రూపాయల బ్యాలెన్స్ మొత్తం ప్రస్తుతం పరిశీలనలో ఉంది.

ముఖ్యంగా NPCI ఇనాక్టివ్‌గా ఉన్న 2,800 ఖాతాలను అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన 30 కోట్ల 41 లక్షల రూపాయల నిధులు నిలిచిపోయాయి. ఈ ఖాతాల జాబితాను APCRDA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. లబ్ధిదారులు వెంటనే తమ ఈ-కేవైసీని పూర్తి చేసి, బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

బ్యాంకింగ్ ప్రక్రియలు, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అర్హులైన రైతులందరికీ కౌలు సొమ్ము అందుతుందని.. పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బ్యాంకులు, లబ్ధిదారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు APCRDA స్పష్టం చేసింది.