
లండన్: టెండూల్కర్–అండర్సన్ సిరీస్‌లో టీమిండియా కీపర్ రిషబ్ పంత్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ తీవ్ర గాయాలను సైతం లెక్కచేయకుండా తమ జట్ల కోసం గ్రౌండ్‌లోకి వచ్చి అందరి మన్ననలూ అందుకున్నారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ వేసిన బాల్ తగిలి పంత్ కాలికి ఫ్రాక్చర్ అయింది. అయినా తను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వోక్స్ భుజానికి గాయమైంది. కానీ, ఛేజింగ్‌లో జట్టు ఓటమి తప్పించేందుకు తీవ్రమైన నొప్పిని భరిస్తూనే అతను గ్రౌండ్‌లోకి వచ్చాడు. తన ఫొటోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. సెల్యూట్ ఎమోజీని జత చేయచేయడం తాను చూశానని వోక్స్ తెలిపాడు.
దానికి స్పందిస్తూ ‘ఈ ప్రేమకు ధన్యవాదాలు. మీ కాలి గాయం త్వరగా నయమవుతుందని ఆశిస్తున్నానని పోస్ట్ చేశా. పంత్ బదులిస్తూ.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. త్వరగా కోలుకోండి, మనం మళ్లీ మైదానంలో కలుసుకుందామంటూ ఒక వాయిస్ నోట్ పంపాడు. నేను పంత్ కాలికి గాయం చేసినందుకు సారీ చెప్పాను’ అని వోక్స్ వెల్లడించాడు. అలాగే, ఐదో టెస్ట్‌లో భుజం గాయంతోనే చివరి ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చినందుకు ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనను ప్రశంసించారని వోక్స్ గుర్తుచేసుకున్నాడు.
‘ఇది గొప్ప ధైర్యం’ అని గిల్ తనతో చెప్పడంతో ‘మీరు అద్భుతమైన సిరీస్ ఆడారు. మీ టీమ్‌కు కంగ్రాట్స్’ అని బదులిచ్చానని వెల్లడించాడు. ఆ టైమ్‌లో తాను చేసిన ఈ సాహసాన్ని గొప్పగా భావించడం లేదని వోక్స్ చెప్పాడు. భుజానికి ఫ్రాక్చర్ అయినందున బ్యాటింగ్‌కు వెళ్లకుండా ఉండాలని తాను ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపాడు. కానీ, ఈ గాయం అయినప్పుడు తన కెరీర్ ప్రమాదంలో పడుతుందేమోనని ఒకానొక దశలో ఆందోళన చెందానని చెప్పాడు.