ఆ క్షమాభిక్ష రూల్స్​కు విరుద్ధం : శ్రీలంక సుప్రీం

ఆ క్షమాభిక్ష రూల్స్​కు విరుద్ధం : శ్రీలంక సుప్రీం
  •      హంతకుడికి రాజపక్స క్షమాభిక్ష పెట్టడంపై శ్రీలంక సుప్రీం ఆక్షేపణ

  ఓ హత్య కేసులో దోషికి శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్ష పెట్టారని శ్రీలంక సుప్రీంకోర్టు తేల్చింది. ఆ క్షమాభిక్షను రద్దు చేస్తూ తాజాగా చారిత్రక తీర్పు వెల్లడించింది. 1978లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టిన తర్వాత సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి. మాజీ అధ్యక్షుడు రాజపక్సకు అత్యంత సన్నిహితుడైన దుమిందా సిల్వా 2011లో తన రాజకీయ ప్రత్యర్థిని చంపేశాడు. ఈ మేరకు కోర్టు అతడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. 

అయితే, 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్స 2021లో సిల్వాకు క్షమాభిక్ష పెట్టారు. దీన్ని సవాల్​చేస్తూ  సిల్వా చేతిలో హత్యకు గురైన వ్యక్తి కుటుంబం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేసు విచారించిన సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఏ నిబంధనల ప్రకారం దోషికి క్షమాభిక్ష పెడుతున్నారనే విషయం వెల్లడించలేదని రాజపక్సను ఆక్షేపిస్తూ, ఆ క్షమాభిక్ష చెల్లదని తీర్పు చెప్పింది. కాగా, హత్య కేసులో సిల్వాను హైకోర్టు గతంలో దోషిగా నిర్ధారించగా, ఇప్పుడు సుప్రీం కోర్టు అదే చెప్పింది.