15 రోజులే గడువు ఇచ్చిన సర్కార్.. నమోదుకు ఇయ్యాల్నే ఆఖరు

15 రోజులే గడువు ఇచ్చిన సర్కార్.. నమోదుకు ఇయ్యాల్నే ఆఖరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతు బీమా నమోదు కోసం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. జులై 15న గైడ్ లైన్స్ ఇచ్చిన రాష్ట్ర సర్కార్.. ఈ నెల 1 వరకే నమోదుకు అవకాశం ఇచ్చింది. కొత్తగా అప్లై చేసుకోవడానికి, రెన్యూవల్ చేసుకోవడానికి ఇదే గడువు విధించింది. అయితే ఓవైపు వర్షాలు, మరోవైపు పంటల నమోదు పనులతో కొత్త రైతు బీమా అప్లికేషన్ల అప్ లోడ్, పాత వాటి రెన్యూవల్ పూర్తి కాలేదని ఏఈవోలు అంటున్నారు. ఇంకా లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిసింది. సర్కార్ గడువు పెంచకపోతే చాలా మంది రైతులు బీమా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం హడావుడిగా గైడ్ లైన్స్ ఇచ్చి, నమోదుకు తక్కువ టైమ్ ఇచ్చి రైతులను బీమాకు దూరం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నిరుడు కూడా తక్కువ గడువు ఇవ్వడంతో వేలాది మంది రైతులు బీమా కోల్పోయారు. 

అనర్హులు 13.64 లక్షల మంది... 

ఈసారి రైతు బీమాకు 50.82 లక్షల మంది రైతులు అర్హులని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో కొత్తగా పాస్ బుక్స్ పొంది దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన రైతులు 4.57 లక్షల మంది. అదే విధంగా ఇప్పటికే పాస్ బుక్స్ ఉండి, ఆన్ లైన్ లో వివరాలు అప్ లోడ్ కాని రైతులు 7.25 లక్షల మంది. వీళ్లు అర్హులైనప్పటికీ రైతు బీమా పరిధిలో లేరు. తాజాగా వీళ్లు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. వీరందరీ డేటాను వ్యవసాయ శాఖ అధికారులు ఆగస్టు 1లోగా నమోదు చేసి ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకి అందించాల్సి ఉంది. మొత్తం 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఏఈవోలు అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తున్నారు. అంతే కాకుండా గతంలోనే బీమా పరిధిలో ఉన్న 38.98 లక్షల మంది రైతుల వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి, ఆగస్టు 1లోగానే అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాల్సి ఉంది. అయితే ఇందులో చాలా వరకు పూర్తి కాలేదని తెలుస్తోంది. కాగా 18 ఏండ్లు నిండని, 60 ఏండ్లు నిండిన రైతులను బీమాకు అనర్హులుగా గుర్తించారు. వీళ్లు 13.64 లక్షల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.  

13 దాకా పెంచాలె: ఏఈవోలు 

కొత్త దరఖాస్తుల అప్ లోడ్, పాత వాటి రెన్యూవల్ కు సర్కార్ ఇచ్చిన గడువు సరిపోలేదని ఏఈవోలు అంటున్నారు. ‘‘11.83 లక్షల మంది రైతుల వివరాలు కొత్తగా నమోదు చేయాల్సి ఉంది. 38.98 లక్షల మంది రైతుల వివరాలు వెరిఫికేషన్ చేసి, రెన్యూవల్ చేయాల్సి ఉంది. జులై 15న సర్కార్ గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా, మూడ్రోజులు సైట్ ఓపెన్ కాలేదు. ఓవైపు వర్షాలు, మరోవైపు పంటల నమోదు, ఇతర పనులతో బీమా నమోదు పూర్తి కాలేదు. తక్కువ టైమ్ ఇచ్చి, ఒకేసారి అన్ని పనులు చేయమని మాపై భారం మోపుతున్నారు” అని వాపోతున్నారు. బీమా నమోదు గడువును ఈ నెల 13 దాకా పెంచాలని కోరుతున్నారు.

నాలుగేండ్లలో 84 వేల మంది మృతి

రైతు బీమా పరిహారం చెల్లించిన లెక్కలను బట్టి గత నాలుగేండ్లలో 84,945 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. 2018-–19లో 31.27 లక్షల మందికి బీమా చేయగా.. 17,666 మంది రైతులు మరణించారు. 2019–20లో 32.16 లక్షల మందికి బీమా చేయగా19,019 మంది.. 2020–21లో 32.73 లక్షల మందికి బీమా చేయగా 28,989 మంది.. 2021–22లో 40.07 లక్షల మందికి బీమా చేయగా 19,271 మంది రైతులు చనిపోయారు.