
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కు ఎంపికైన అబ్యర్థులకు గుడ్ న్యూ్స్ చెప్పింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-I పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శనివారం ( సెప్టెంబర్ 27) నియామకపత్రాలు అందజేయనున్నారు. ఆరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు.
అందుకోసం 26 సాయంత్రం లోపు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి ప్రభుత్వం ఆదేశించింది. గ్రూప్ 1 కు ఎంపికైన మొత్తం 562 మంది సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.
అయితే గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. దీనిపై బుధవారం (సెప్టెంబర్ 24) విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాలు అనుకూలంగా రావడంతో టీజీపీఎస్సీ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. గ్రూప్ 1 నియామకాలపైనే గ్రూప్ 2, గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ఆధారపడి ఉండటంతో వెంటనే ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బుధవారం అర్ధరాత్రి 562 మంది సెలక్షన్ లిస్టును విడుదల చేశారు.
మల్టీజోన్ల వారీగా ఏ పోస్టుకు ఎవరు ఎంపికయ్యారనే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు. టాప్ టెన్ ర్యాంకర్ల పేర్లనూ కమిషన్ వెల్లడించింది. వీరంతా డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికైనట్టు ప్రకటించింది. అయితే, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల నేపథ్యంలో ఈ రిజల్ట్స్ ఫైనల్ జడ్జిమెంట్‌కు లోబడి ఉంటాయని కమిషన్ పేర్కొంది. తప్పుడు సమాచారంతో ఎంపికైన వాళ్లను ఏదశలోనైనా తొలగిస్తామని తెలిపింది.